కేసీఆర్ కు హుజూరాబాద్ అంత దడ పుట్టిస్తోందా?

Update: 2021-08-02 05:50 GMT
బలం.. బలహీనం రెండు భిన్నధ్రువాలైనప్పటికీ.. ఒకప్పటి బలం.. తర్వాతి రోజుల్లో బలహీనతగా మారటానికి అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయి అనిశ్చితి నెలకొని ఉండే రాజకీయాల్లో ఇలాంటివి చాలా ఎక్కువ. శాశ్విత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ రాజకీయాల్లో ఉండరని చెబుతారు. అందుకు కేసీఆర్ - ఈటల అతీతం కాదు. ఏ ఈటల పేరు చెప్పి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను రగిలించారో.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా ఈటలను ఉద్దేశించి దివంగత మహానేత వైఎస్ అన్న మాటల్ని పదే పదే ప్రస్తావించి.. తనకు తగ్గట్లు అన్వయించుకొని అర్థం  చెప్పిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే రాజకీయ లబ్థిని పొందారు.

అలాంటి ఈటలతో కేసీఆర్ కు విబేదాలు రావటం.. కారణాలు ఏమైతేనేం.. ఆయన్ను పార్టీ నుంచి అవమానకర రీతిలో వెళ్లిపోయేలా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెబుతారు. తాను ప్రేమిస్తే ఆకాశానికి ఎత్తేసే కేసీఆర్.. ఏ మాత్రం తేడా వచ్చినా పాతాళానికి తొక్కేసేలా మాట్లాడే కేసీఆర్.. ఈటల విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తున్నారు. ఈటల ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ లో ఆయనకున్న బలం ఎంతన్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లోనూ గెలుపొందిన ఈటల.. తన రాజకీయ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్యగా మారిన ఉప ఎన్నికల్లో విజయం అనివార్యమవుతుంది.

ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికను తాను సీరియస్ గా తీసుకోవటం లేదన్న సంకేతాల్ని ఇచ్చి ఉండే పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా ఈటల ఓటమి విషయంలో కేసీఆర్ ఎంత సీరియస్ గా ఉన్నారన్నది ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏది ఏమైనా.. ఎంత ఖర్చు అయినా ఫర్లేదు కానీ.. హుజూరాబాద్ లో మాత్రం తాను నిలబెట్టిన అభ్యర్థి మాత్రమే విజయం సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. తాను అనుకున్నంతనే హుజూరాబాద్ లో విజయం రాదన్న విషయం తెలిసిందే. అందుకే.. పలువురు మంత్రులతోపాటు ముఖ్య నేతల్ని నియోజకవర్గంలో దించిన కేసీఆర్.. గడిచిన కొద్ది రోజులుగా పావులు కదుపుతున్నారు.

క్షేత్రస్థాయిలో ఈటల వర్గీయుల్ని తన వైపుకు తిప్పుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన భారీగా వరాలు కురిపిస్తున్నారు. దీనంతటికి మించి.. దళితబంధు లాంటి భారీ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడని తీరు చూస్తే.. నోట మాట రాదని చెబుతారు. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైన దళితబంధు పథకం రానున్న రోజుల్లో న్యాయ సమీక్షకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

తాజాగా పాడె కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించిన వైనం చూస్తే.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆయన ప్రతిష్ఠాత్మకం తీసుకోవటమే కాదు.. ఇంత ముందుకు వచ్చిన తర్వాత ఏ మాత్రం వెనక్కి తగ్గినా జరిగే నష్టం అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంది. మరోవైపు ఈటల మొదలు పెట్టిన ప్రచారం ఊపందుకోవటం.. అనుకోని రీతిలో ఆయన అస్వస్థతకు గురి కావటం తెలిసిందే. నియోజకవర్గంలో ఆయన మీద సానుభూతి వ్యక్తమవుతోందన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్ మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని ఇవ్వకూడదన్నట్లుగా ఉన్న కేసీఆర్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన చేస్తున్న ఖర్చు రికార్డుస్థాయిలో ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బలం ఉందని నమ్మకం ఉంటే.. కేసీఆర్ ఇంత భారీగా ఖర్చులు చేస్తారా? అన్నది అసలు ప్రశ్న. ఇదొక్కటి చాలు.. హుజూరాబాద్ విషయంలో ఆయన తీరు ఏమిటన్నది అర్థమవుతుందంటున్నారు.
Tags:    

Similar News