టీ ఎన్నికలు.. తేలిన లెక్క.. పోటీ సీట్లు ఇవే..

Update: 2018-11-23 07:02 GMT
తెలంగాణలో తొలి అంకం ముగిసింది. ఎంత మంది బరిలో ఉంటారనేది తేలిపోయింది. అసమ్మతులు - అసంతృప్తులు - రెబల్స్ సద్దుమణిగి ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీచేస్తుందనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది.  మహాకూటమి పేరుతో మూడు పార్టీల కొట్లాట ఓ కొలిక్కి వచ్చిన వేళ ఎట్టకేలకు ఇక ప్రచార పర్వానికి రంగం సిద్ధమైంది.

మహాకూటమిలోని పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీచేస్తున్నాయో లెక్క తేలింది.  పెద్దన్న కాంగ్రెస్ అత్యధికంగా 99 స్థానాల్లో పోటీకి దిగింది. ముందుగా కూటమిలో అనుకున్న 94 సీట్లకు ఇది 5 సీట్లు అదనం. నాలుగు చోట్ల తెలంగాణ జనసమితికి జలక్ ఇచ్చి కాంగ్రెస్ బీఫాంలు ఇచ్చి మోసం చేసింది. ఈ నాలుగు చోట్ల టీజేఎస్ - కాంగ్రెస్ పోటీపడుతుండడం గమనార్హం.  ఇక టీడీపీ 14 సీట్లలో పోటీ అని చెప్పి ఒక సీటును త్యాగం చేసి 13 సీట్లకే పరిమితమైంది. ఇక టీజేఎస్ ఎనిమిది చోట్ల రంగంలోకి దిగింది. సీపీఐ మూడు చోట్ల పోటీల్లో నిలిచింది.   

ఇక కాంగ్రెస్ కు రెబల్స్ బెడద ఉంది. ఏడు చోట్ల వారు రంగంలో ఉన్నారు. టీఆర్ ఎస్ కు కూడా రెబల్స్ బరిలో ఉన్నారు. ఆరు చోట్ల గులాబీ రెబల్స్ భయపెడుతున్నారు. సీపీఐకి కాంగ్రెస్ పార్టీ కేటాయించిన రెండు సీట్లల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ రెబల్స్ ఉండడం కమ్యూనిస్టుపార్టీని కలవరపెడుతోంది.ఇక టీడీపీకి కేటాయించిన ఇబ్రహీం పట్నంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి బుజ్జగింపులకు లొంగలేదు. ఆయన బీఎస్పీ తరఫున ఇబ్రహీంపట్నం బరిలో ఉన్నారు. ఇది టీడీపీకి శరాఘాతంగా మారింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సామా రంగారెడ్డి బలహీన అభ్యర్థి కావడం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి కలిసివస్తోంది.
Tags:    

Similar News