టైం పెంపు: అర్థ‌రాత్రి వ‌ర‌కూ ఈక్విటీ ట్రేడింగ్!

Update: 2018-05-05 05:34 GMT
దీర్ఘ‌కాలంగా ఉన్న డిమాండ్ విష‌యంలో సెబీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అక్టోబ‌రు ఒక‌టి నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్ ట్రేడింగ్‌ను అర్థ‌రాత్రి ప‌న్నెండు గంట‌ల‌కు ఐదు నిమిషాల ముందు వ‌ర‌కూ ట్రేడింగ్ చేసేలా నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళ‌లు ఉద‌యం 9.15 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌వ‌ర‌కూ ఉంది. అదే స‌మ‌యంలో క‌మోడిటీ డెరివేటివ్స్ విభాగం ఉద‌యం 10 గంట‌లు మొద‌లు రాత్రి 11.55 వ‌ర‌కూ ఉంది. తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్ ట్రేడింగ్ రాత్రి 11.55 వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది.

స్టాక్స్.. క‌మోడిటీల ట్రేడింగ్ వేళ‌ల‌ను అనుసంధానం చేసే ప్ర‌య‌త్నాల్లో భాగంగా సెబీ ఈ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంద‌ని చెప్పాలి.  ఈ కొత్త ప‌ని వేళ‌లు అక్టోబ‌రు 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో దాదాపు ఎనిమిది గంట‌ల‌కు పైగా అద‌న‌పు స‌మ‌యం ట్రేడింగ్‌ కు వీలుంటుంది. చిర‌కాలంగా పెండింగ్ లో ఉన్న ట్రేడింగ్ వేళ‌ల పెంపు ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించిన వైనంపై స్టాక్ ఎక్చ్సేంజీలు స్వాగ‌తించాయి. దేశీయ మార్కెట్ల‌ను అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు అనుసంధానం చేసేందుకు ఇది తోడ్ప‌డుతుంద‌ని పేర్కొంటున్నారు.

మ‌రి.. ఈ కొత్త విధానం కార‌ణంగా లాభాలేంటి?  న‌ష్టాలేంటి? అన్న లెక్క‌లోకి వెళితే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వస్తాయి.

ట్రేడింగ్ టైం పెంచ‌టం కార‌నంగా భార‌తీయ క్యాపిట‌ల్ మార్కెట్స్ మ‌రింత విస్త‌రించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. ట్రేడింగ్ వేళ‌ల్లో వ్య‌త్యాసాల కార‌ణంగా దేశీ మార్కెట్ల‌పై అంత‌ర్జాతీయ ప‌రిణామాలు.. ప్ర‌తికూల ప్ర‌భావాలు చూపే రిస్క్ లు త‌గ్గే వీలుంద‌ని చెబుతున్నారు. ట్రేడింగ్ వేళ‌లు పెంచ‌టం కార‌ణంగా దేశీ ఇన్వెస్ట‌ర్ల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌తికూల‌మైనా.. సానుకూల‌మైనా ప్ర‌భావితం చేసే ప‌రిణామాల‌కు త‌గ్గ‌ట్లు మ‌న ఇన్వెస్ట‌ర్లు త‌క్ష‌ణ‌మే స్పందించే అవ‌కాశం లేదు. తాజా నిర్ణ‌యంతో అది కాస్తా అధిగ‌మించే వీలుంది.

ట్రేడింగ్ సమ‌యాన్ని పెంచ‌టంతో క‌లిగే లాభ‌న‌ష్టాల్ని చూస్తే..

ప్ర‌యోజ‌నాలు

+ సాధారణ ట్రేడింగ్ త‌ర్వాత చోటుచేసుకునే పరిణామాలపై ట్రేడర్లు తక్షణం స్పందించే వీలుంటుంది. మరుసటి రోజు ట్రేడింగ్‌ ప్రారంభమయ్యే వరకు వేచిచూడకుండా అప్పటికప్పుడే షేర్లను కొనడం లేదా అమ్మకానికి నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెల్లడించడం, వ్యాపార కార్యకాలాపాలపై ఏదేని ముఖ్య ప్రకటనలు వెల్లడించడం లాంటి సందర్భాల్లో ట్రేడింగ్‌ సమయం గడువు పొడిగింపు ఉపయోగపడుతుంది.  

* ట్రేడింగ్‌ సమయం అనంతరం ప్రపంచంలో ఏ ప్రతికూల పరిణామం చోటుచేసుకున్నా, విదేశీ మార్కెట్లు భారీగా పతనమైనా మర్నాడు స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభం అవ్వగానే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తాజా నిర్ణయం వల్ల మర్నాడు ట్రేడింగ్‌ ప్రారంభం అయ్యేసరికి ఆ తీవ్రత తగ్గుముఖం పడుతుంది.

* ప్రస్తుతం ట్రేడింగ్‌ జరుగుతోన్న సమయం ప్రత్యేకించి ట్రేడింగ్‌ చేసే వాళ్లకు తప్పించి మిగిలిన వారికి అనుకూలంగా ఉండ‌దు. ఉద్యోగులు, వ్యాపారులు త‌మ దైనందిక ప‌నుల్ని చూసుకుంటూ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం క‌ష్టంగా ఉంటుంది. తాజాగా మార్చిన స‌మ‌యంతో ఇలాంటి ఇబ్బందులు అధిగ‌మించేందుకు అవ‌కాశం ఉంటుంది.

+ ట్రేడింగ్ టైంను పెంచ‌టం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కూ టైంను కేటాయించ‌లేని ప‌లు వ‌ర్గాల వారు ఇక‌పై మ‌రింత స‌మ‌యాన్ని కేటాయించే అవ‌కాశం ఉంటుంది.

మైన‌స్ పాయింట్స్‌

- సాధారణ ట్రేడింగ్‌ సమయంతో పోలిస్తే ఆ తర్వాత జరిగే ట్రేడింగ్‌లో లావాదేవీలు స్తబ్దుగా జరుగుతాయి. గిరాకీ తక్కువగా ఉంటుంది.

- బిడ్‌ - ఆఫర్‌ ధరపైనా ప్రభావం పడుతుంది. అందువల్ల మనం ఏదైతే ధరకు అమ్మాలని అనుకుంటున్నామో  ఆ ధరకు కొనుగోలుదారు ఉండదు. దీంతో అంతకంటే తక్కువ ధరకు అమ్ముకొని బయటపడాల్సి వస్తుంది. ఒకవేళ కొనాలంటే కూడా మనం అనుకున్న ధర కంటే ఎక్కువ ధరకు కొనాల్సి ఉంటుంది.

-  సాధారణ ట్రేడింగ్‌ సమయంతో పోలిస్తే ఆ తర్వాత జరిగే ట్రేడింగ్‌ లో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయి.  

-  సంస్థాగత మదుపర్ల నుంచి పోటీ ఎక్కువ‌గా ఉంటుంది. బ్రోకరేజీ సంస్థల ట్రేడింగ్‌ ఆంక్షలు కూడా ఎక్కువే ఉండే అవ‌కాశం ఉంటుంది.


Tags:    

Similar News