ఉద్యోగులు తీసిన లా పాయింట్ మంచిదేనా?

Update: 2015-11-10 05:57 GMT
ఏపీ సచివాలయ ఉద్యోగుల వైఖరి ఈ మధ్య వివాదాస్పదంగా మారటం తెలిసిందే. ఏపీ రాజధానికి తరలి వెల్లేందుకు వారు చాలానే కోర్కెలు కోరటం ఏపీ ప్రజల్లో భారీ అగ్రహం వ్యక్తమైంది. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉన్నా.. ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని ఏ మాత్రం అంచనా వేయని సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏపీ సర్కారు చెప్పిన విధంగా తాము 2016 జూన్ 2 నాటికి వచ్చేయటానికి ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని.. తమకు డబుల్ హెచ్ ఆర్ ఏలు అవసరం లేదని చెప్పారు.

తాజాగా వారు ఒక కొత్త లా పాయింట్ తీశారు. ఏపీ రాజధాని అమరావతి అన్న విషయాన్ని గుర్తిస్తూ కేంద్ర హోంశాక అధికారిక ప్రకటన జారీ చేయాలని.. చట్ట సవరణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో రాజధానికి సంబంధించి భాగానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సవరణ చేయాలని కోరుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణాలు సహేతుకంగానే ఉన్నాయి. రాజధాని అమరావతి అన్న విషయంపై కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేసి.. చట్ట సవరణ చేస్తే.. దీనికి సంబంధించి మార్పలుకు అవకాశం ఉండదు.

లేని పక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయానికి ఉదాహరణగా సచివాలయ ఉద్యోగులు కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఘటనను ఉదహరిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన సమయంలో హైదరాబాద్ రింగు రోడ్డుకి సంబంధించి ఒక ప్రణాళిక సిద్దం చేశారు. 2002లో బాబు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరో విధంగా రోడ్డు వేయటాన్ని వారు ఉదహరిస్తున్నారు. భవిష్యత్తులో రాజధాని మార్పు మీద రాజకీయ నిర్ణయాలు చోటు చేసుకోకుండా ఉండేలా చట్టసవరణ చేయాలని కోరుతున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు తీసిన లా పాయింట్ ఒక విధంగా మంచిదే. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రం దృష్టి సారిస్తే మంచిది.
Tags:    

Similar News