ఛీ..ఛీ.. శవాల దగ్గరా సెల్ఫీలేనా..?

Update: 2015-10-12 12:09 GMT
ట్రెండ్ అన్నది పెద్ద వ్యసనంగా మారిపోయింది. చేతిలో కెమేరాల పుణ్యమా అని.. మొదలైన సెల్ఫీల గోల ఇప్పుడు హద్దులు దాటుతోంది. నిన్న మొన్నటివరకూ తమకు తాము తీసుకోవటం.. గ్రూపులుగా తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. అది కాస్త హద్దులు దాటి.. వెర్రితనంగా మారి.. సెల్ఫీ మోజుతో ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు.

ఇక.. అత్యుత్సాహంతో సెల్ఫీలు తీసుకుంటూ తిట్లు తిన్న వారూ ఉన్నారు. ఘోర రోడ్డు ప్రమాదం జరిగినా.. అనుకోని విపత్తు విరుచుకుపడినా.. సాటి మనిషికి సాయం చేసే కన్నా.. సెల్ఫీ తీసుకోవటం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఆ మధ్య నేపాల్ లో చోటు చేసుకున్న దారుణ భూకంపం నేపథ్యంలో.. చారిత్రక కట్టడాలు చాలానే కూలిపోయాయి. మరోవైపు శిధిలాల్లో వందలాది మంది చిక్కుకొని సాయం కోసం ఆక్రోశిస్తున్న వేళ.. ఇవన్నీ పట్టించుకోకుండా.. సెల్ఫీలు తీసుకుంటూ గడిపేసిన వారు చాలామందే ఉన్నారు.

ఇలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. మనిషి చనిపోయి పుట్టెడు శోకంలో కుటుంబ సభ్యులు మునిగిపోయి ఉంటే.. వారిని ఓదార్చకున్నా ఫర్లేదు.. కానీ అందుకు భిన్నంగా శవాల దగ్గర సెల్ఫీల పిచ్చితో.. చుట్టుపక్కల వారి మానసిక పరిస్థితిని పట్టించుకోకుండా తీసుకునే వారికి ఈ వ్యక్తి ఓ నిదర్శనం. ఇటీవల ముంబయిలో మరణించిన మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర  జైన్ అంత్యక్రియల సమయంలో ఓ వ్యక్తి అత్యుత్సాహంతో కెమేరాలతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించాడు. అంతేకాదు.. జైన్ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకు వెళుతుంటే.. ఆ వ్యక్తి సెల్ఫీలు తీసుకోవటం కనిపించింది. సెల్ఫీల మీద మోజుతో సమయం సందర్భం లేకుండా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిని ఏమనాలి?
Tags:    

Similar News