టీడీపీ నేత పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Update: 2021-10-21 15:52 GMT
టీడీపీ నేత పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టాభి సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో ఇప్పటికే పట్టాభిపై నాలుగు కేసులు నమోదు చేశామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. విజయవాడలో పట్టాభి ఘర్షణ సృష్టిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. పట్టాభిని మచిలిపట్నం జైలుకు తరలించారు. నవంబర్ 2వరకు రిమాండ్ విధించారు.

బుధవారం రాత్రి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి తోట్లవళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. నవంబర్ 2 వరకు పట్టాభికి కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాలతో పటిష్ట బందోబస్తు మధ్య పట్టాభిని మచిలీపట్నం జైలుకు తరలించారు. అయితే పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో.. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరించారు. పట్టాభి వ్యాఖ్యలను కేవలం వ్యాఖ్యలు గానే చూడాలా? లేక పోతే అందులో కుట్ర దాడి ఉందా? అనే దానిపై పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టించే విధంగా పట్టాభి వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసలు చెబుతున్నారు. ముఖ్యం సీఎం జగన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యల్లో కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.

పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద కేసుల నమోదు చేశామని పోలీసులు తెలిపారు. విజయవాడ నగరంలో రెండేళ్లలో నాలుగు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. వన్‌టౌన్, సూర్యారావు పేట, గవర్నర్ పేట పోలీస్‌స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తుచేశారు. ఈ కేసులు నమోదుకావడానికి గల కారణాలు, కేసులు నమోదైన సందర్భాలు, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించినప్పుడు కూడా ఆయన గొడవలు సృష్టించే విధంగా ప్రసంగాలు, మీడియా సమాశాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. పథకం ప్రకారం గొడవలు సృష్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అందువల్ల పట్టాభిని అరెస్ట్ చేయకపోతే సమాజంలో కొత్త సమస్యలు సృష్టించే ఆస్కారం ఉందని తాము నమ్ముతున్నామని పోలీసుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.
Tags:    

Similar News