2024 ఎన్నికలకు తిరుగులేని అస్త్రాన్ని బయటకు తీసిన షా

Update: 2023-01-06 04:11 GMT
మహా అయితే మరో ఏడాది మాత్రమే మిగిలింది. షెడ్యూల్ ప్రకారం చూసినప్పుడు లోక్ సభకు జరిగే ఎన్నికలు 2024 మార్చితో మొదలై.. మే మధ్య నాటికి ముగియటం తెలిసిందే. అంటే.. గట్టిగా చూస్తే మరో ఏడాది మాత్రమే సమయం ఉంది.2024 జనవరి వచ్చిందంటే.. సార్వత్రిక ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లే. ఎందుకంటే.. జనవరిలో బడ్జెట్ లాంటి వాటిని మమ అనిపించేసి.. ఫిబ్రవరిలో ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావటం.. యావత్ దేశం ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవటం ఖాయం. దేశ వ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికలను దాదాపు ఐదారు విడతలు.. లేదంటే మరో రెండు విడతలకు పెంచి మరీ పూర్తి చేయాల్సి ఉంటుంది. పనిలో పనిగా షెడ్యూల్ లో భాగంగా ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్ని కలిపి నిర్వహించటం తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటికే సిద్దం కావటమే కాదు.. అందులో భాగంగా పార్టీ కీలక నేత రాహుల్ దేశ వ్యాప్త పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి అందుకు రియాక్షన్ రావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు రాలేదు. ఆ కొరతను తీర్చేశారు బీజేపీ ముఖ్యనేత.. మోడీకి నీడలా ఉండే కేంద్ర మంత్రి అమిత్ షా. ఆయన నోటి నుంచి సంచలన ప్రకటన ఒకటి బయటకు వచ్చింది.

2024 జనవరి ఒకటో తేదీని అయోధ్యలోని రామాలయాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు.. దశాబ్దాల పర్యంతం ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయాన్ని ప్రారంభించే ముఖ్యమైన ప్రోగ్రాంకు సంబంధించిన విషయాన్ని వెల్లడించటం ద్వారా.. సార్వత్రిక ఎన్నికల మూడ్ ఏ రీతిలో ఉండనుందన్న విషయాన్ని అమిత్ షా చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

తాజాగా త్రిపురలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. అయోధ్య రామాలయ ప్రారంభానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనను చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణ కేసును కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల్లో అడ్డుకుంటూ వచ్చిందని.. మోడీ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూను క్లోజ్ చేయటంతో పాటు.. సుప్రీంకోర్టు అనుమతితో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించిన వైనాన్ని గుర్తు చేశారు.

2024 జనవరి ఒకటో తేదీన రామాలయాన్ని ప్రారంభించటం ద్వారా 2024 సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ముడి సరుకును సిద్ధం చేయటమే కాదు.. సెంటిమెంట్ ను దండిగా రాజేసే.. ఎజెండాను అమిత్ షా సిద్ధం చేస్తున్న వైనం తాజా ప్రకటనను చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు.. అయోధ్య రామాలయాన్ని ఎంతలా కట్టిస్తున్న వైనాన్ని చెప్పుకొచ్చారు.

వేయ్యేళ్లు గడిచినా చెక్కు చెదరనంత బలంగా రామాలయాన్ని నిర్మించినట్లుగా పేర్కొన్నారు. పునాదుల్ని భారీగా.. సువిశాలంగా నిర్మించటంతో పాటు.. మందిర నిర్మాణానికి దాదాపు 9 లక్షల క్యూబిక్ అడుగుల మక్రానా మార్బుల్ రాల్లను వాడుతున్న విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు.. రామాలయం మీదనే ఫోకస్ అంతా పెట్టటమే కాదు.. అయోధ్య రామాలయానికి వెళ్లే దారులన్నింటిని భారీగా ముస్తాబు చేస్తున్న వైనం చూస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రాముడి వ్యవహారం ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా ఉంటుందని చెప్పక తప్పదు. మరి.. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ లాంటి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News