ఉన్న నాలుగు ప్రావిన్సుల‌నే చూసుకోలేక‌పోతోంది.. పాకిస్తాన్‌కు కశ్మీర్ ఎందుకు?: పాక్ క్రికెట‌ర్

Update: 2022-09-14 06:38 GMT
క‌శ్మీర్ అంశంపై ఒక‌ప్ప‌టి పాకిస్థాన్ క్రికెట్ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌మ దేశంలో నాలుగు ప్రావిన్సులు ఉన్నాయ‌ని.. వాటినే పాకిస్థాన్ చూసుకోలేక‌పోతోంద‌ని.. అలాంటిది పాకిస్థాన్‌కు ఇంకా క‌శ్మీర్ ఎందుక‌ని షాహిద్ అఫ్రిది హాట్ కామెంట్స్ చేశాడు.

బ్రిటిష్ పార్ల‌మెంటులో తాజాగా విద్యార్థులతో మాట్లాడుతూ అఫ్రిది ఈ వ్యాఖ్య‌లు చేశాడు. "క‌శ్మీర్‌ను భార‌త్‌. పాకిస్థాన్‌ల‌కు రెండింటికి ఇవ్వ‌కూడ‌దు. క‌శ్మీర్ ప్ర‌త్యేక దేశంగా కొన‌సాగాలి. అప్పుడైనా అక్క‌డ హింస‌కు పుల్ స్టాప్ ప‌డుతుంది. సాధార‌ణ ప్ర‌జ‌లు త‌మ ప్రాణాల‌ను పోగొట్టుకోకుండా ఉంటారు"  అని షాహిది అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

 "కనీసం క‌శ్మీర్‌లో మానవత్వమైనా మిగలాలి. అక్కడ ఉన్నప్ర‌జ‌ల మరణాలు ఆగాలి. అక్కడ అలా జనం మరణిస్తుంటే కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా మనిషి చనిపోతే.. తను ఏ మతం వాడైనా, బాధగా ఉంటుంది. క‌శ్మీర్ పాకిస్తాన్‌కు అవసరం లేదు. ఉన్న నాలుగు ప్రావిన్సులనే పాకిస్తాన్ చూసుకోలేకపోతోంది"   అని షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించాడు.

షాహిది అఫ్రిది చేసిన ఈ తాజా వ్యాఖ్య‌ల వీడియో సోష‌ల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వ్యాఖ్య‌ల ద్వారా క‌శ్మీర్ మాది అని అనుకోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న త‌న దేశానికి చెప్పాడ‌ని భార‌త్ మీడియా పేర్కొంది.

త‌న వ్యాఖ్య‌ల‌పై పాకిస్థాన్‌లో దుమారం రేగ‌డంలో షాహిద్ అఫ్రిది మాట‌మార్చాడు. భార‌త్ మీడియా త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించింద‌ని ఆరోపిస్తూ ట్వీట్ చేశాడు.

 "నా క్లిప్ అసంపూర్ణంగా ఉంది. నేను ఇంతకు ముందు చెప్పింది అందులో లేదు. కశ్మీర్ అనేది పరిష్కరించబడని వివాదం. క్రూరమైన భారతీయ ఆక్రమణలో అది ఉంది. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం దీనిని పరిష్కరించాలి. నేను ప్రతి పాకిస్తానీతో పాటు కాశ్మీరీ స్వాతంత్య్ర‌ పోరాటానికి మద్దతిస్తాను. కాశ్మీర్ పాకిస్థాన్‌కు చెందుతుంది "... అని అఫ్రిది ట్వీట్ చేశాడు.

అంతకు ముందు అఫ్రిది "నా వ్యాఖ్యలను భారతీయ మీడియా తప్పుగా అర్థం చేసుకుంటోంది! నేను నా దేశం పట్ల ప్రేమ‌ను కలిగి ఉన్నాను. క‌శ్మీరీల పోరాటాలకు ఎంతో విలువనిస్తున్నాను. మానవత్వం గెలవాలి.. వారి హక్కులను పొందాలి" అని ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News