రాష్ట్రప‌తి ప‌ద‌విపై బీజేపీకి కొత్త టెన్ష‌న్‌

Update: 2017-05-08 18:04 GMT
రాష్ట్రప‌తి ఎన్నిక గ‌డువు స‌మీపిస్తున్న కొద్ది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఎన్డీయే ప‌క్ష పార్టీలు వివిధ రూపాల్లో త‌మ అభ్య‌ర్థ‌నలు వినిపిస్తూనే ఉన్నాయి. కూట‌మిలో ఉన్న‌ప్ప‌టికీ త‌న సొంత ఎజెండాతో ముందుకు పోయే శివసేన తాజాగా ఇదే రీతిలో స్పందించింది. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా రూపాంతరం చెందించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ను రాష్ట్రపతిని చేయాలని శివ‌సేన‌ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు.

ఔరంగాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ హిందూ రాజ్య స్థాపన తమ ప్రాథమిక లక్ష్యమని, కనుక భగవత్‌ రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఈ విష‌యంలో బీజేపీ, ఎన్డీఏ త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఉద్దేశం తనకెంతమాత్రం లేదని గతంలోనే మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు. మ‌రోవైపు విప‌క్షాలు ఉమ్మ‌డి అభ్య‌ర్థి కోసం త‌మ ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాయి. ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ క‌లిసివ‌చ్చే పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.
Tags:    

Similar News