మోహన్ బాబుపై శివాజీ ధ్వజం

Update: 2019-03-23 08:11 GMT
‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గత ఏడాది గొప్ప కామెడీ షో చేశాడు యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ శివాజీ. ఆ తర్వాత కూడా ఈ కామెడీని అతను కొనసాగిస్తూనే ఉన్నాడు. ముందు భారతీయ జనతా పార్టీలో ఉండి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని విమర్శించిన శివాజీ.. తర్వాత యు టర్న్ తీసుకుని తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా మారిపోయాడు. ఈ మధ్య ఆ పార్టీకి మౌత్ పీస్ అయ్యాడతను. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న శివాజీ.. తాజాగా లెజెండరీ యాక్టర్ మోహన్ బాబును టార్గెట్‌ గా చేసుకున్నారు. తన విద్యా నికేతన్ విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై కొంత కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న మోహన్ బాబు.. నిన్న విద్యార్థులతో  కలిసి ధర్నా కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ మోహన్ బాబును విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు.

మోహన్ బాబు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ తో ఎప్పుడూ రోడ్ల మీదికి రాలేదని.. కానీ తన కాలేజీ ప్రయోజనాల కోసం మాత్రం రోడ్డెక్కారని శివాజీ విమర్శించాడు. విద్యా నికేతన్ ప్రైవేటు సంస్థ అని.. వాళ్లకు బకాయిలు రావాల్సి ఉంటే ఆందోళన చేయడంలో తప్పేమీ లేదని.. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బకాయిలు ఎలా వస్తాయని శివాజీ ప్రశ్నించాడు. మోహన్ బాబు మీద తనకు గౌరవం ఉందని.. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి బకాయిలు రావని తెలిస కూడా ఆయన ఆందోళన చేయడమేంటని అతనన్నాడు. ఏపీ ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉందని.. అందరికీ సమయానికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని అర్థం చేసుకోవాలన్నాడు. ప్రభుత్వం రైతులకు.. మహిళలకు.. నిరుద్యోగులకు.. ఇలా ఒకరి తర్వాత ఒకరికి డబ్బులు చెల్లిస్తూ సాగుతోందని శివాజీ చెప్పాడు. ఎన్నికల ముందే మోహన్ బాబు ఈ ఆందోళన చేపట్టడాన్ని తప్పుబట్టిన శివాజీ.. ఆయన కానీ.. ఆయన విద్యా సంస్థ కానీ ప్రత్యేక హోదా కోసం ఎప్పుడైనా పోరాడారా అని ప్రశ్నించాడు.

Tags:    

Similar News