ట్రంప్ అస్సలు తగ్గట్లేదుగా? అతడి క్రేజ్ కు సొంత పార్టీలోనే షాక్

Update: 2021-08-01 23:30 GMT
అమెరికా అధ్యక్ష స్థానంలో కూర్చోవటానికి ఎలాంటి అర్హతలు అయితే ఉంటాయో.. అవన్ని పుణికి పుచ్చుకున్న నేత డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాల అంచనాల్ని తలకిందులు చేస్తూ ఆయన అమెరికా అధ్యక్షపదవిని చేపట్టారు. అప్పటి నుంచి మొదలైన రచ్చ.. చివరకు ఆయన రెండో సారి ఎన్నికల బరిలో నిలవటం.. ఎన్నికల ఫలితాలు సైతం కాసింత గందరగోళానికి గురయ్యేలా చేసినా.. చివరకు బైడెన్ విజయం సాధించటం తెలిసిందే. అయినప్పటికీ బైడెన్ కు అధికార బదిలీ చేసేందుకు కాస్తంత మొండికేసిన ట్రంప్ వైఖరి ఆయన్ను బలపరిచే కొందరిలో విస్మయానికి గురి చేసింది.

తాను తిరిగి వస్తానని చెబుతూ.. వైట్ హౌస్ నుంచి సెలవు తీసుకున్న ఆయన.. మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వివాదాస్పద అధ్యక్షుడిగా పేరున్న ట్రంప్ కు.. అభిమానగణం ఒక రేంజ్లో ఉందన్న విషయం తాజాగా మరోసారి రుజువై.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్రంప్ ను అభిమానించే వారు.. మద్దతు ఇచ్చే వారు.. తమ వంతుగా ఆయనకు చెందిన రిపబ్లిక్ పార్టీకి.. ట్రంప్ కు చెందిన ఫండ్ రైజింగ్ కమిటీలకు భారీగా విరాళాలు ఇస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎవరెన్ని చెప్పినా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన నిధుల్ని పెద్ద ఎత్తున సమీకరించాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్లే.. ఆయనకు మద్దతుగా విరాళాలు అదే పనిగా ఇస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా విడుదలైన లెక్కలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో ఆయనకు 56 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తాన్ని మన రూపాయిల్లో చూస్తే ఏకంగా రూ.416.52 కోట్లు.

ఈ నిధులకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ట్రంప్మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కమిటీ పేరుతో విరాళాలు సేకరిస్తున్న సంస్థకు ఆర్నెల్ల వ్యవధిలో రూ.252.88 కోట్లు రాగా.. మరోపక్క ట్రంప్ సొంత ఫండ్ రైజింగ్ కమిటీలన్ని కలుపుకుంటే రూ.163.63 కోట్ల విరాళాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంత భారీగా వస్తున్న విరాళాల్ని చూసి..  రిపబ్లికన్ పార్టీ నేతల్ని సైతం విస్మయానికి గురి చేస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికి ఆయనకు కించిత్ క్రేజ్ కూడా తగ్గలేదన్న వాదనను ఆయన మద్దతుదారులు వినిపిస్తున్నారు.

భారీగా వసూలైన విరాళాలకుసంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. యాభై డాలర్ల కంటే తక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారే ఎక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ను వ్యతిరేకించే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే క్రేజ్ సాగితే 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ పోటీకి దిగే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రచ్చ రచ్చగా మారటం ఖాయమంటున్నారు. అమెరికా చట్టాల ప్రకారం ఏ అధ్యక్షుడైనా రెండుసార్లు అధ్యక్ష్ పదవిని చేపట్టొచ్చు. మూడోసారికి మాత్రం అవకాశం లేదు. ఈ లెక్కన మరోసారి అధ్యక్ష స్థానాన్నిచేపట్టే వీలుంది.
Tags:    

Similar News