యూట్యూబ్ హెడ్డాఫీస్ ద‌గ్గ‌ర షాకింగ్ ఘ‌ట‌న‌

Update: 2018-04-04 04:34 GMT
యూట్యూబ్ హెడ్డాఫీస్ ద‌గ్గ‌ర షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక మ‌హిళ కాల్పుల‌కు తెగ‌బ‌డిన వైనం సంచ‌ల‌నంగా మారింది. అమెరికాలోని శాన్ బ్రూన్ లోని యూట్యూబ్ ప్ర‌ధాన కార్యాల‌యం ద‌గ్గ‌ర ఒక మ‌హిళ విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల ఉదంతంలో న‌లుగురు తీవ్రంగా గాయ‌పడ్డారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అమెరికా కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం మ‌ధ్య‌హ్నం వేళ‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ మ‌హిళ‌.. అనంత‌రం త‌న‌ను తాను కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. కాల్పుల ఉదంతం గురించి తెలిసిన వెంట‌నే పోలీసులు అప్ర‌మ‌త్త‌మై.. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

కాల్పుల నేప‌థ్యంలో యూట్యూబ్ ఉద్యోగులంతా ఉలిక్కిప‌డ్డారు. కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో ఒక మ‌హిళ మృత‌దేహాన్ని గుర్తించారు. కాల్పుల‌కు తెగ‌బ‌డిన మ‌హిళ‌దే మృత‌దేహంగా భావిస్తున్నారు. ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణంలో కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకున్నంత‌నే ఉద్యోగులంతా ఉలిక్కిప‌డ్డారు.

భ‌యంతో ప‌రుగులు తీశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. యూట్యూబ్ లో మొత్తం 1700 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. కాల్పుల్లో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  కాల్పుల‌కు కార‌ణ‌మైన తుపాకీని ప‌రిశీలించ‌గా మొత్తం 10 రౌండ్ల మేర కాల్పులు జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స్పందించారు. బాధితుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. కాల్పుల‌కు తెగ‌బ‌డిన మ‌హిళ ఎవ‌రు?  ఆమె ఎందుకు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు? త‌దిత‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రావాల్సి ఉంది. అధికారులు విచార‌ణ‌ను ముమ్మ‌రం చేస్తున్నారు.
Tags:    

Similar News