ఇక‌.. ఆ రాష్ట్రం నిద్ర పోయే ఛాన్స్ లేదంతే

Update: 2017-08-12 04:33 GMT
దేశంలో తొలిసారి ఒక రాష్ట్రం వినూత్న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌శ్చిమ దేశాల్లో ఉన్న క‌ల్చ‌ర్ ను  తీసుకురావ‌టం ద్వారా.. ఆ రాష్ట్రంలో రాత్రి.. ప‌గ‌లు ఇక‌పై ఒకేలా ఉండ‌నుంది. రోజులో 24 గంట‌లూ ఎప్పుడైనా.. ఎక్క‌డైనా ఏదైనా కొనేందుకు.. ఏదైనా తినేందుకు వీలుగా మ‌హారాష్ట్ర స‌ర్కారు ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకుంది.

మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడా రాష్ట్రంలో రాత్రి.. ప‌గ‌లు అన్న తేడా లేకుండా షాపులు.. హోట‌ళ్లు.. షాపింగ్ మాల్స్ ఇక‌పై 24 గంట‌లూ తెరిచి ఉంచేందుకు వీలుగా అధికారిక నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు వీలుగా చ‌ట్టంలో మార్పు తెచ్చే బిల్లును తాజాగా ఆమోదించారు. ఈ నిర్ణ‌యంతో ఇక‌పై రోజు మొత్తంలో ఎప్పుడైనా కొనుగోలు చేసుకునే అవ‌కాశం ఉండ‌నుంది. అయితే.. ఇందుకు కొన్ని ప‌రిమితులు విధించి.. బిల్లును ఆమోదించారు.

నాన్ స్టాప్ గా 24 గంట‌లూ షాపుల్ని.. రెస్టారెంట్ల‌ను తెరిచి ఉంచాల‌నుకునే వారు క‌చ్ఛితంగా స్థానిక పోలీస్ స్టేష‌న్ లో అనుమ‌తి తీసుకోవాల‌ని సూచించారు. 50 మందికి పైగా మ‌హిళా ఉద్యోగులు ప‌ని చేసే షాపింగ్ మాల్‌.. రెస్టారెంట్ల‌లో య‌జ‌మానులు త‌ప్ప‌నిస‌రిగా చైల్డ్ కేర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఇక‌.. నైట్ షిఫ్ట్ లో ప‌ని చేసే మ‌హిళ‌ల్ని సుర‌క్షితంగా ఇంటికి చేర్చే బాధ్య‌త స‌ద‌రు షాపు యాజ‌మాన్యాల‌దేన‌ని చట్టం స్ప‌ష్టం చేస్తోంది. సో.. మ‌హారాష్ట్ర ఇక‌పై నిద్ర‌పోయే ఛాన్స్ త‌క్కువేన‌న్న మాట‌. మ‌రి.. మ‌హారాష్ట్ర స్ఫూర్తిని తీసుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా ఇదే త‌ర‌హా నిర్ణ‌యాన్ని తీసుకుంటారా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News