హరీశ్ నడుస్తుంటే.. పూల వర్షాన్నే కురిపించారెందుకు?

Update: 2020-05-04 05:30 GMT
విజన్ తో ఒక ముఖ్యమంత్రి పని చేస్తే.. ఆ రాష్ట్రం రూపురేఖలు ఎలా మారతాయన్న దానికి నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టును చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం లక్ష కోట్లకు పైనే ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల కాలంలో తాను నమ్మిన దాని కోసం ఇంత భారీగా నిధులు ఖర్చు చేసే సాహసాన్ని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. తాను అనుకున్న పనిని.. అనుకున్నట్లుగా పూర్తి చేయాలన్న కసి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎక్కువనే చెప్పాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాల్ని తెలంగాణ ఇప్పటికే పొందుతున్న వేళ.. తాజాగా మరిన్ని ప్రాంతాలకు కాళేశ్వరం నీరు అందే కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం జలాలతో తెలంగాణలోని పలు ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలోని కోదండరావు పల్లి.. లక్ష్మీదేవి పల్లెల్లో రంగనాయక సాగర్ ఎడుమ కాలువ ద్వారా గ్రామాల్లోని చెరువులు నిండాయి.

దీంతో.. ఆయా ప్రాంతాల గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఊళ్లకు వచ్చిన కాళేశ్వరం నీళ్లతో స్థానిక దేవాలయాల్లోని దేవతామూర్తులకు అభిషేకాన్ని నిర్వహించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు అరుదైన స్వాగతం లభించింది. గ్రామంలోకి అడుగుపెట్టిన హరీశ్ రావుకు పూలు జల్లారు. ఆయన గ్రామంలో నడుస్తుంటే.. పూలవర్షాన్ని తలపించేలా గ్రామస్థలు పూలు జల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బొంబాయి.. దుబాయ్ పోవుడు వద్దు.. బాయి కాడికే పోయి.. గుంటేడు పొలం ఉన్నా పని చేసుకుందామన్న వ్యాఖ్య చేశారుమరీశ్. గోదావరి జలాలతో రాష్ట్రంలో ఏడాదికి  రెండు పంటలు పండించే శుభ గడియలు షురూ అయ్యాయని చెప్పారు. కాళేశ్వరం నీటితో ప్రతి ఎకరం బంగారంలా పంటలు పండిస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఇకనుంచి రైతులు రంది పడొద్దని.. కాళేశ్వరం జలాలతో కాలంతో.. కరెంటు తో సంబంధం లేకుండా ఏడాది పొడువునా పంటలు తీయొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమైనా.. ఒక భారీ ప్రాజెక్టుతో మారిన తెలంగాణ ముఖం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News