సిద్దూ.. నీకిదేం పోయే కాలం..?

Update: 2018-10-14 05:51 GMT
సౌత్‌.. నార్త్ అన్న తేడా లేకుండా భార‌తీయులం అన్న భావ‌న‌తో బ‌తికేసే ద‌క్షిణాది వారిని ఏదో తీరులో త‌ర‌చూ అవ‌మానించ‌టం ఈ మ‌ధ్య‌న కొంద‌రు ప్ర‌ముఖుల‌కు ఒక అల‌వాటుగా మారింది. సౌత్ అంటేనే సాంబార్ ఇడ్లీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వారు..ప్ర‌తి విష‌యానికి తీసి పారేస్తున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

తాజాగా సౌత్‌ పై మాజీ క్రికెట‌ర్.. పంజాబ్ మంత్రి సిద్ధూ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. సిద్దూ ఆట‌ను కానీ.. అత‌గాడి షోల‌ను తిల‌కించిన వారిలో కేవ‌లం నార్త్ వారు మాత్ర‌మే కాదు.. సౌత్ వాళ్లు ఉన్నారు. అంత‌దాకా ఎందుకు.. క్రికెట్ ఆడిన టైంలో మ‌న సిద్ధూ అని అక్కున చేర్చుకున్నోళ్ల‌లో సౌత్ వారెంత‌మందో. కానీ.. ఈ అభిమానం ఏదీ సిద్ధూకు లేన‌ట్లుంది.

సౌత్ లో ఎన్ని రాష్ట్రాలు సిద్ధూ తిరిగారు?  ఎంత మంది ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు?  అన్న ప్ర‌శ్న‌ల్ని సంధించాల‌న్న ఆగ్ర‌హం ఆయ‌న తాజా మాట‌లు వింటే క‌లుగుతుంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌టం కంటే పాకిస్థాన్ కు వెళ్ల‌టం మంచిదంటూ తూలిన మాట ద‌క్షిణాది వారి మ‌న‌సుల్ని తీవ్రంగా క‌లిచి వేస్తుంద‌ని చెప్పక త‌ప్ప‌దు.

పాక్ క‌ల్చ‌ర్‌కు.. ద‌క్షిణాది క‌ల్చ‌ర్ కు చాలా తేడా ఉంద‌న్న సిద్ధూ.. త‌మిళంలో వ‌ణ‌క్కం లాంటి ఒక‌ట్రెండు ప‌దాలు త‌ప్ మ‌రేమీ అర్థం కావ‌న్న ఆయ‌న‌.. పాక్ కు వెళితే పంజాబీ.. ఇంగ్లిష్ మాట్లాడ‌తార‌న్నారు.

సిద్ధూ మాట‌లు అహంకారంతో కూడుకున్న‌వే త‌ప్పించి మ‌రింకేమీ కావు. ఈ రోజున ద‌క్షిణాదిలోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోకి వెళ్లినా ఇంగ్లిషు మాట్లాడుతున్న ప‌రిస్థితి. గ‌తంతో పోలిస్తే.. ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడే వారు బాగానే పెరిగార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

కానీ.. అవేమీ ప‌ట్ట‌న‌ట్లుగా.. చాలా విష‌యాల మీద అవ‌గాహ‌న లేద‌న్న విష‌యం సిద్ధూ మాట‌ల్ని వింటే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ద‌క్షిణాది అంటే.. చెన్నై మాత్ర‌మే అనుకుంటున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. సౌత్ కంటే.. పాక్ కు వెళ్ల‌టం బెట‌ర్ అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సిద్ధూకు వీసా ఇచ్చేసి శాశ్వితంగా దాయాది దేశానికి పంపేస్తే స‌రిపోతుంది. విభిన్న సంస్కృతుల స‌మ్మేళ‌న‌మైన దేశంలోని ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్య‌వ‌హ‌రించే సిద్ధూ ఆచితూచి మాట్లాడాల్సి ఉంది.
 అందుకు భిన్నంగా కోట్లాది మంది మ‌నోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడ‌టం ఎంత మాత్రం సంస్కారం కాద‌న్న విష‌యాన్ని సిద్ధూ అర్థం చేసుకుంటే మంచిది.

త‌మ అవ‌గాహ‌నారాహిత్యంతో నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే సిద్ధూ లాంటోళ్ల కార‌ణంగా లేనిపోని వివాదాలు తెర మీద‌కు వ‌స్తుంటాయి. ఇలాంటి వారి మాట‌ల్ని మొద‌ట్లోనే తుంచేస్తే మంచిది. ఒక‌రిని పొగ‌డ‌టం కోసం మ‌రొక‌రిని చిన్న‌బుచ్చేలా మాట్లాడ‌టం మాన‌వత్వం అనిపించుకోదు సిద్ధూ.

పాక్ లోని క‌ర్తాపూర్ సాహెబ్ గురుద్వారాలోకి భార‌తీయ సిక్కుల్ని అనుమ‌తిస్తే.. వారికి కౌగిలింతతో పాటు.. ఈసారి ముద్దు కూడా పెడ‌తాన‌ని చెప్పిన సిద్ధూ మాట‌లు చూస్తే... లేని దాని కోసం ఉన్నోళ్ల‌ను వ‌దులుకునే చిన్న‌పిల్లాడు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News