ట్రెండింగ్: వివాహాలకు వెండి మాస్క్‌లు

Update: 2020-05-18 12:59 GMT
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఎంతసేపు సర్జికల్ మాస్క్ లు, నూలు మాస్క్ లు.. ఎన్95 మాస్కులేనా? కొత్తగా ఆలోచించరా.. ఇంకా దేనితో మాస్క్ లు చేయొచ్చా యోచించరా.? అలానే ఆలోచించారు కన్నడిగులు. తమ రాజబోగాలకు.. హోదాకు సరితూగేలా ఏకంగా వెండి మాస్క్ల్ లు తయారు చేయించారు. పెళ్లిల్లో వీటిని అతిథులకు పంపిణీ చేసి ఇంతటి కష్టకాలంలో కూడా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

మహమ్మారి దెబ్బకు భారతదేశంలో వివాహాలు సాదాసీదాగా తక్కువ మంది అత్యంత భద్రతా చర్యలను తీసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. వందల, వేల మంది అతిథులతో విలాసవంతమైన వివాహాలకు కాలం చెల్లింది. వివాహాలకు హాజరయ్యే పరిమిత సంఖ్యలో అతిథులు ఇప్పుడు ముసుగులు ధరించాలి. వేదిక వద్ద వారి చేతులను శానిటైజర్ తో శుభ్రపరచాలి.

ఈ భయంకరమైన పరిస్థితులలో కూడా.. కర్ణాటకలోని కొన్ని సంపన్న కుటుంబాలు తమ వివాహాలు ఉత్సాహంగా అత్యంత భారీ ఖర్చుతో చేయడం ట్రెండింగ్ గా మారింది. పెళ్లిళ్లను అత్యంత భారీగా చేసుకునే ధనవంతులైన కన్నడిగులు వివాహాలలో తమ అతిథులకు రాచమర్యాదలు చేస్తుంటారు. అది వారి ఆనవాయితీ.. అతిథులకు సాధారణ బట్టతో చేసిన మాస్క్ లు కాకుండా వెండితో చేసిన డిజైనర్ మాస్క్ లను పంపిణీ చేయడం విశేషంగా మారింది.

ఈ వెండి ముసుగు ధర రూ .2,500 నుంచి 3,000 రూపాయాల మధ్య ఉంటుంది. బెల్గావి.. చిక్కోడి వంటి నగరాల్లో ఈ వెండి మాస్క్ లకు అధిక డిమాండ్ ఉంది. ఈ కొత్త రకం మాస్క్ క్రేజ్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం కర్ణాటకలో ఎగబడుతున్నారు. దీంతో ఈ వెండి మాస్క్ తయారీదారులు.. స్వర్ణకారులకు చేతినిండా పనిదొరికింది. ఈ మాస్క్ లకు డిమాండ్ పెరిగిపోవడంతో వారు ఈ కష్టకాలంలో ఉపాధిని పొందుతున్నారు.
Tags:    

Similar News