సొంత నియోజకవర్గంలో కేటీఆర్ కు పరాభవం

Update: 2016-08-20 12:07 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి - సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ కు భ‌లే సంక‌టం వ‌చ్చిప‌డింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్లా జిల్లాకు ప్ర‌భుత్వం నో చెప్పింది. దీంతో అక్క‌డ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం ఊపందుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ అధికారులు స్థానికంగా ఉన్న‌ మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపున‌కు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆందోళనదారులు కొన్నిచోట్ల‌ కేటీఆర్‌ ఫ్లెక్సీలను కొన్ని చోట్ల దహనం చేయడంతో వెంటనే అప్రమత్తమైన మున్సిపల్‌ సిబ్బంది పట్టణంలోని కేటీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సిరిసిల్ల జిల్లా సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట విద్యార్థులు ఆందోళ‌న చేశారు. సిరిసిల్ల జిల్లా చేయాలని కోరుతూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి ‘జై సిరిసిల్ల’ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ప‌లువురు విద్యార్థులు ఆందోళ‌న వ‌ల్ల పోలీసుల‌తో కొంతమేర తోపులాట జరిగి వీరిని అరెస్ట్‌ చేసి ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఇదిలాఉండ‌గా సిరిసిల్ల జిల్లా కోసం  మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. సంఘం ఆధ్వ‌ర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం నేతన్న విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్‌ చౌక్‌లో బతుకమ్మ ఆటలాడి నిరసన తెలిపారు. జిల్లా ఏర్పాటు అయ్యే వరకు పోరాటం ఆగదన్నారు.

మ‌రోవైపు సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని ఆమరణ దీక్ష చేపట్టిన అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ గాజుల బాలయ్యను బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఆకుల విజయ మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో దీక్షను కొనసాగిస్తున్న బాలయ్యకు మద్దతు తెలిపారు. సిరిసిల్ల సాధన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తున్న బాలయ్య పోరాటాన్ని అభినందించారు. మంత్రి కేటీఆర్‌ స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మొత్తంగా జిల్లా ఏర్పాటు మంత్రి కేటీఆర్‌ కు ప‌రువు స‌మ‌స్య‌గా మారిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News