స్మృతి నోరు విప్పాలంటే ఆయన పర్మిషన్ కావాలి

Update: 2016-02-29 05:54 GMT
తన ఒక్క ప్రసంగంతో విపక్షాల్ని ఇరుకున పడేసిన ఘనత కేంద్రమంత్రి స్మృతి ఇరానీకే దక్కుతుంది. అదే సమయంలో.. విపక్షాలన్నీ కూడబలుక్కొని మరీ అధికారపక్షంపై దాడి చేసి డిఫెన్స్ లో పడేయటానికి కూడా స్మృతి కారణంగా మారారు. జేఎన్ యూ.. హెచ్ సీయూ వర్సిటీల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఈమధ్యన స్మృతి చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తొలుత స్మృతి ప్రసంగం పట్ల ప్రధాని మోడీ.. హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ లు ఇద్దరూ సంతృప్తి వ్యక్తం చేసిన వారే. ఒకదశలో రాజ్ నాధ్ అయితే ఆమె ప్రసంగాన్ని.. దాన్ని చెప్పిన తీరును ప్రస్తావిస్తూ స్మృతిని ప్రత్యేకంగా అభినందించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ ప్రసంగం తర్వాత విపక్షాలు మూకుమ్మడిగా ముప్పేట దాడి చేయటం మొదలు కాగానే.. స్మృతి ప్రసంగం వల్ల జరిగిన లాభంతో పాటు.. నష్టం ఎంతన్నది బీజేపీ అధినాయకత్వానికి అర్థమైందని చెబుతున్నారు. దీంతో.. నష్టనివారణ చర్యలు షురూ చేశారని.. మెలోడ్రామాతో కూడిన ప్రసంగాలు చేయొద్దని స్మృతికి సూచించినట్లు చెబుతున్నారు.

ఒకవేళ ఏదైనా మాట్లాడాలని భావిస్తే.. తొలుత అరుణ్ జైట్లీతో మాట్లాడి.. ఆయన అనుమతితోనే మాట్లాడాలని గట్టిగా చెప్పినట్లు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన స్మృతి ప్రసంగం.. ఆమెకు సరికొత్త సవాళ్లు తెచ్చి పెట్టిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News