ఇలాంటి యాడ్స్ అవ‌స‌ర‌మా స్నాప్ డీల్‌

Update: 2017-08-17 05:40 GMT
ఎవ‌రు అవునన్నా..కాద‌న్నా షాపింగ్ విష‌యంలో మ‌గాళ్ల కంటే మ‌హిళ‌లే ముందుంటారు. అదేమీ త‌ప్పు కూడా కాదు. కానీ.. చిన్న‌బుచ్చ‌టం ద్వారా లేనిపోని తిప్పులు తెచ్చుకోవటం వ్యాపారంలో ఏ మాత్రం మంచిది కాదు. వెరైటీ యాడ్ తో అంద‌రి దృష్టి ప‌డేలా చేసుకోవాల‌న్న ఆలోచ‌న మంచిదే కానీ.. మొదటికే మోసం తెచ్చుకోకూడ‌ద‌న్న విష‌యాన్ని ప్ర‌ముఖ ఇ-కామ‌ర్స్ పోర్ట‌ల్ స్నాప్ డీల్ మ‌ర్చిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

తాజాగా ఆ కంపెనీ త‌యారు చేయించిన యాడ్ వివాదంగా మార‌ట‌మే కాదు.. షాపింగ్‌కు ఆయువుప‌ట్టులాంటి మ‌హిళ‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా ఉంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ ముచ్చట మీద సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మొద‌లైంది. సెలబ్రిటీలు సైతం స్నాప్ డీల్ ను ఉతికి ఆరేయ‌టం మొద‌లెట్టారు. స్నాప్ డీల్ కు వ్య‌తిరేకంగా ట్వీట్లు చేసిన వారిని అభినందిస్తున్న వారు త‌క్కువేం కాదు.

ఇంత‌కీ.. మ‌హిళ‌ల్ని చిన్న‌బుచ్చేలా స్నాప్ డీల్ యాడ్‌లో ఏముంద‌న్న విష‌యాన్ని చూస్తే.. జ‌బ్బా మూవీలో ఐశ్వ‌ర్య‌రాయ్ ప‌రిగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి.. ఎంత షాపింగ్ చేసిందో భ‌ర్త తెలుసుకునే లోపే.. ఆమె ఇలా డోర్ ద‌గ్గ‌ర‌కు ప‌రిగెడుతోందన్న వ్యాఖ్య‌తో పాటు.. ఇది మీకు కూడా వ‌ర్తిస్తుందా? అన్న ట్వీట్ చేశారు. ఈ యాడ్ పై సోష‌ల్ మీడియాలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

అదే ప‌నిగా మ‌హిళ‌లు షాపింగ్ చేస్తారంటూ స‌టైర్ వేసుకోవ‌టం కామెడీకి బాగుంటుంది కానీ.. వ్యాపారం చేసుకునే సంస్థ ఇలాంటి యాడ్ క్రియేట్ చేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. దీనికి త‌గ్గ‌ట్లే.. స్నాప్ డీల్ యాడ్‌కు సెల‌బ్రిటీల జంట షాకిచ్చే ట్వీట్ చేశారు.

టాలీవుడ్ న‌టుడు.. ప్ర‌ఖ్యాత గాయ‌ని క‌మ్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మ‌యి భ‌ర్త రాహుల్ రియాక్ట్ అవుతూ.. గ‌త ఏడాది త‌న సంపాద‌న కంటే త‌న భార్య సంపాద‌నే ఎక్కువ‌ని.. త‌న కంటే ఆమే ఎక్కువ ప‌న్ను చెల్లిస్తోంద‌ని పేర్కొన్నారు. త‌న ఆన్ లైన్‌..ఇత‌ర షాపింగ్ ల‌కు త‌న డ‌బ్బులే వాడుతుంద‌ని.. ఆమె ఎక్క‌డికి ప‌రిగెత్తాల్సిన అవ‌స‌రం లేదంటూ కౌంట‌ర్ ట్వీట్ చేశారు. దీనికి ప్ర‌తిగా భ‌ర్త చేసిన ట్వీట్ కు బ‌దులిచ్చిన చిన్మ‌యి.. త‌న భ‌ర్త లాంటి వ్య‌క్తినే ప్ర‌తి అమ్మాయి త‌న జీవిత భాగ‌స్వామిగా కోరుకుంటుంద‌న్నారు. రాహుల్ కౌంట‌ర్‌కు సోష‌ల్ మీడియాలో స్పంద‌న ఎక్కువ‌గా ఉంది. అయినా.. ఈకాలంలో మ‌హిళ‌ల్ని చిన్న‌బుచ్చ‌టం ఏమిటంటూ ప‌లువురు స్నాప్ డీల్ యాడ్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఊహించ‌ని రీతిలో వెల్లువెత్తిన విమ‌ర్శ‌ల‌తో స్నాప్ డీల్ త‌న ట్వీట్ ను.. వీడియోను డిలీట్ చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News