తెలంగాణ‌లో ఇప్పుడంతా... టెక్ పాల‌నే!

Update: 2018-01-01 13:36 GMT
కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో ఇప్పుడంతా నిజంగానే టెక్ పాల‌న సాగుతోంది. టీఆర్ ఎస్ యువ‌నేత‌ - ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైద‌ర‌బాదులో ఏర్పాటైన ఐటీ హ‌బ్ ఇప్ప‌టికే రికార్డుల‌కు ఎక్కిన విష‌యం తెలిసిందే. అంతేనా... ప్ర‌జా ఫిర్యాదుల‌ను తీసుకునేందుకు కూడా కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా మొన్న ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇక నిత్యం త‌న ట్విట్ట‌ర్‌ కు వ‌చ్చే వివిధ స‌మ‌స్య‌ల‌పై స్పందించే కేటీఆర్‌... వాటికి ప‌రిష్కారాల‌ను కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గానే చూపుతున్న వైనం నిజంగా ఇప్పుడు తెలంగాణ‌లో స‌రికొత్త పాల‌న‌కు తెర తీసిన‌ట్లుగానే చెప్పాలి.

కేటీఆర్ సంగ‌తి స‌రే... మ‌రి తెలంగాణ పోలీసింగ్ విష‌యానికి వ‌స్తే... కేటీఆర్ కంటే ఓ అడుగు ముందుకేసిన ఆ రాష్ట్ర పోలీసు శాఖ... రాష్ట్రంలోని ప్ర‌తి పోలీస్ స్టేష‌న్‌ కు ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను ఏర్పాటు చేసి... ఆయా పోలీస్ స్టేష‌న్ల ప‌నితీరుపై ప్ర‌జ‌లు నిర్భయంగా త‌మ పీడ్ బ్యాక్ చెప్పేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ మేర‌కు ఆ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నూత‌న సంవ‌త్స‌రం వేళ ఓ ఆస‌క్తికర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేష‌న్ల‌కు ట్విట్ట‌ర్‌ - ఫేస్ బుక్‌ ల‌లో ప్ర‌త్యేకంగా ఖాతాల‌ను తెరుస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణలో రక్షణ - భ‌ద్ర‌త‌ల‌ను ప్ర‌జ‌లంద‌రికీ చేరువ చేసే యోచ‌న‌లో భాగంగా సాంకేతిక ప‌రిజ్ఞాన స‌హ‌కారం తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 800 పోలీసు స్టేష‌న్ల‌కు ప్ర‌త్యేక సోష‌ల్‌ మీడియా ఖాతాల‌ను సృష్టించ‌నున్నామని ఆయ‌న చెప్పారు. మొద‌ట హైద్రాబాద్‌ లోని స్టేష‌న్ల‌కి - త‌ర్వాత ఇత‌ర జిల్లాల్లోని స్టేష‌న్ల‌కి ఈ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నామని, ఈ ఖాతాల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డ‌మే కాకుండా వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ ను తీసుకుంటామ‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పారు. మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌కట‌న ప్ర‌కారం... ఇక‌పై తెలంగాణ‌లోని ప్ర‌తి పోలీస్ స్టేష‌న్‌కు ఓ ఫేస్ బుక్ అకౌంట్‌ తో పాటుగా ఓ ట్విట్ట‌ర్ అకౌంట్ కూడా ఏర్పాటు కానుంద‌న్న మాట‌. ఇదే గ‌నుక అమ‌ల్లోకి వ‌స్తే... నిజంగానే తెలంగాణ‌లో పోలీసింగ్  కొత్త పుంత‌లు తొక్క‌డం ఖాయ‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News