వ‌రుస బాంబు పేలుళ్లు..231 మంది మృతి

Update: 2017-10-16 04:27 GMT
సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ట్రక్కు బాంబు దాడిలో 231మంది మృతిచెందారు. మరో 275మందికి పైగా గాయపడ్డారు. రద్దీ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకొని శనివారం ఈ దాడి జరిగింది. సోమాలియా కేంద్రంగా పనిచేస్తున్న అల్‌ఖాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ఈ మారణహోమానికి పాల్పడిందని భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతమంతా భూకంపం తర్వాతి విధ్వంసాన్ని తలపించింది. పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్పకూలాయి. భారీ వాహనాలు - ట్రక్కులు తునాతునకలయ్యాయి. మనుషులు కాలిబూడిదయ్యారు. ఒక్కరోజు గడిచినప్పటికీ ఆ ప్రాంతంలో మంటలు ఆరలేదు.

సొమాలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం సమీపంలోని 'సఫారీ హౌటల్‌' ప్రధాన గేటు వద్ద మొదటి పేలుడు సంభవించింది. ఈప్రాంతంలో ప్రభుత్వ కార్యాల యాలు - హౌటల్స్‌ - రెస్టారెంట్స్‌ - పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. కొద్ది గంటల తర్వాత మదీనా జిల్లాలో రెండో పేలుడు సంభవించింది. బాంబు దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని, అంత తీవ్రతతో పేలుడు శబ్దాల్ని తామెప్పుడూ వినలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు చెప్పారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. మరోవైపు సోమాలియా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లాహీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. క్షతగ్రాతులకు రక్తాన్ని దానం చేయడానికి ప్రజలు ముందుకురావాలని అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

సొమాలియాలో స్థానిక ప్రభుత్వానికి -అల్‌ షబాబ్‌ ఉగ్రవాదులకు అంతర్యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజా వరుస బాంబు పేలుళ్లు అల్‌ షబాబ్‌ ఉగ్రవాద ముఠా పనేనని సొమాలియా పోలీస్‌ ఉన్నతాధికారులు అను మానిస్తున్నారు. 2011 తర్వాత ఈ ఉగ్రముఠా నుంచి సొమాలియా పాలకులకు పెద్ద ఎత్తున సవాళ్లు ఎదురవుతున్నాయి. 2006-2011 - ఆగస్టు వరకూ మొగదీషు అంతా అల్‌ షబాబ్‌ ఉగ్రవాద ముఠా ఏలుబడిలో ఉండేది. ఆఫ్రికన్‌ యూనియన్‌ - సొమాలీ సైనిక బలగాలు ఉగ్రవాదుల్ని తరిమికొట్టి - నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

దీంతో అల్‌ షబాబ్‌ ఉగ్రముఠా తరుచూ భీకరమైన ప్రతీకార దాడులకు తెగబడుతున్నది. తొలుత సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకునేది. ఇప్పుడు జనసమ్మర్థం ఉండే స్థలాల్ని లక్ష్యంగా చేసుకొని, దేశంలోని దక్షిణ - మధ్య ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నది. 2011లో ట్రక్‌నిండా పేలుడు పదార్థాలతో ప్రభుత్వ అపార్ట్‌ మెంట్‌ భవనంపైకి దూసుకెళ్లి - ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ దాడిలో 100 మందికిపైగా చనిపోయారు.
Tags:    

Similar News