ఏపీలో బస్సులకు జగన్ రైట్ రైట్

Update: 2020-05-18 11:50 GMT
ఏపీ వాసులకు సీఎం జగన్ తీపి కబురందించారు. లాక్ డౌన్ వల్ల వేర్వేరు పట్టణాల్లో చిక్కుకున్న వారు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. ఏపీలో ప్రజారవాణాకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు కార్లలో ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. అంతే కాదు, ఉదయం 7 నుంచి రాత్రి 7వరకు దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతినిచ్చారు జగన్. సీఎం జగన్ తాజా నిర్ణయంతో దాదాపు 2 నెలలుగా ఇళ్లలో చిక్కకున్నవారికి ఊరట లభించింది.లాక్ డౌన్ 4.0 లో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ఏపీలో ప్రజారవాణా పునరుద్ధరించాలని...కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే, అంతర్‌ రాష్ట్ర సర్వీసులలో భాగంగా మొదటగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి బస్సు సర్వీసులను అనుమతించాలని యోచిస్తున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై ఆయా రాష్ట్రాలతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారు.దీంతోపాటు రెస్టారెంట్లలో టేక్ ఎవేలకు అనుమతినిచ్చారు. రాత్రి 7 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుందని, ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకే దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. దుకాణాల ముందు ఒక విడతలో 5గురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత బస్సులు నడపాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. మరో 3 లేదా 4 రోజుల్లో బస్సులను నడిపే తేదీలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.

అయితే, బస్సు ప్రయాణాలకు సంబంధించి ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ మాత్రమే సర్వీసులు నడపాలని, మధ్యలో ఎక్కేందుకు అనుమతి ఇ‍వ్వకూడదని జగన్ తెలిపారు. బస్టాండ్‌లో దిగిన తరువాత వారికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవడం వల్ల ట్రేస్‌ చేయడం సులభంగా ఉంటుందన్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 50 శాతం సీట్లు మాత్రమే నింపాలని, బస్సులో 20 మందికి మాత్రమే ప్రయాణించాలని, దశలవారీగా ప్రజారవాణా పెంచుకుంటూ పోవాలని జగన్ అన్నారు. కార్లు తదితర ప్రైవేట్ వాహనాల్లో ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలిపారు. కారులో ప్రయాణించేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రతి దుకాణంలో ఐదుగురు మాత్రమే ఉండాలని, పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మంది వరకే అనుమతి ఉందన్నారు. రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవే కు అనుమతినిచ్చినట్లు తెలిపారు. టేక్‌ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందేనని ఆదేశించారు. కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు పోవాలని, ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ సాధ్యమవుతుందన్నారు. వార్డు క్లినిక్స్‌ ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. వచ్చే మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలని సీఎం ఆదేశించారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా చూడాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సీఎం జగన్‌ అధికారులకు అదేశాలు జారీ చేశారు.
Tags:    

Similar News