ఆర్కేకు బీజేపీపై సడన్ గా ప్రేమ పుట్టిందట

Update: 2020-08-23 08:30 GMT
బీజేపీ మీద మీకింత ఆకస్మాత్తుగా ప్రేమ పుట్టుకు రావటం ఏమిటి? అంటూ ప్రశ్న రూపంలోనే ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు ఘాటు పంచ్ వేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. తమ మీదా.. తమ పార్టీ మీదా ఇంత ప్రేమ పుట్టుకురావటంపై ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీ ఎదగకపోవటంపై ఆవేదనను.. ఎదగటానికి అవసరమైన ఐడియాలను ఇచ్చే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు.

ప్రతి వారాంతంలోనూ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. ఒక కాలమ్ రావటం.. అందులో సమకాలీన రాజకీయాల మీద తనదైన రీతిలో విశ్లేషణలు చేస్తుంటారు. అదే క్రమంలో ఉన్నతస్థానాల్లో ఉన్నోళ్ల మాటల్ని.. పలు ఉదంతాల్ని అవసరానికి తగ్గట్లు తన రాతల్లో ప్రస్తావిస్తుంటారు. తాజాగా బీజేపీ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండే జీవీఎల్ తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టారు తన తాజా కాలమ్ లో. ఇదే విషయాన్ని ఆర్కేను సూటిగా ప్రశ్నించారు సోము వీర్రాజు.

ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్న మాటను చెప్పిన జీవీఎల్ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. ఆయన తీరును తప్పు పట్టటమే కాదు.. బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆయన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారతాయనన సూచన చేశారు. దీనిపై సోము రియాక్ట్ అయ్యారు. చంద్రబాబును జీవీఎల్ విమర్శించటం తమకు మంచిది కాదని విశ్లేషించారన్న సోము.. ఏపీలో పార్టీ బలపడాలంటే జీవీఎల్ లాంటి వారు వద్దంటూ చెప్పిన సూచనను తప్పు పట్టారు.

గతంలో ప్రధాని మోడీని.. వారి కుటుంబాన్ని.. బీజేపీని దారుణంగా టార్గెట్ చేసిన ఆర్కే.. ఇప్పుడు తమ పార్టీ మీద అంత ప్రేమ పొంగుకురావటం వెనుకున్న కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ బలపడాలంటే.. జీవీఎల్ ను కట్టడి చేయాలన్న ఆర్కే వ్యాఖ్యను సోము తీవ్రంగా తప్పు పట్టారు. ఆర్కేవ్యాఖ్యల వెనుక బీజేపీ మీద ప్రేమ కంటే కూడా బాబును రక్షించుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. అయినా.. పత్రికను అడ్డు పెట్టుకొని.. తమ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేయటం ఏమిటి? ఇదేం పద్దతి అని చెడామడా అన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీకి మీరు అనుకూలంగా పని చేస్తారని.. ఆ పార్టీకి సలహాదారుగా ఉంటారని ప్రజలు అనుకుంటారని.. మీ సలహాలు ఏమైనా ఉంటే బాబుకే ఇవ్వాలన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకు పరిమితం కావటం వెనుక మీ పాత్ర ప్రధానమని అంటుంటారని.. ఇప్పుడు కనుక ఆర్కే సలహాలు..సూచనలు వింటే ఈసారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమవుతారని పేర్కొన్నారు. ఆర్కే విశ్లేషణ వెనుకున్న మతలబు.. ఆయన పడుతున్న తాపత్రయాన్ని తాను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి.. మరోసంచలనం త్వరలోనే ఉంది కదా? అన్న సంకేతాన్ని సోము తన ఓపెన్ లెటర్ తో స్పష్టం చేశారని చెప్పాలి.
Tags:    

Similar News