సోముకి బాబు మీద ఈ స‌డ‌న్ ల‌వ్ ఏంటి?

Update: 2022-08-06 04:59 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్వ‌రంలో మార్పు వ‌చ్చిందా? ఆ మార్పు సంకేతం ఏంటి? అనే అంశాల‌పై నెటిజ‌న్ల‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నుంచి బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి సోము వీర్రాజు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, గ‌త‌ టీడీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. టీడీపీతో త‌మ‌కు ఎలాంటి పొత్తు ఉండ‌బోద‌ని కూడా ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. అలాంటి వ్య‌క్తి స‌డెన్ గా చంద్ర‌బాబు దార్శ‌నికుడు అంటూ కితాబులివ్వ‌డం చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు దార్శ‌నికుడు కాబ‌ట్టే ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి రూ.8,500 కోట్ల నిధులు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చింద‌ని సోము వీర్రాజు చెబుతున్నారు. చంద్ర‌బాబుతో పోల్చితే జగన్‌ దార్శనికుడు కాదు కాబట్టే ఇవ్వడం లేదని సోము వీర్రాజు తేల్చిచెప్పారు. జ‌గ‌న్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ చెప్పి కనీసం మూడు రూపాయలు కూడా ఖర్చుపెట్టలేద‌ని ఎద్దేవా చేశారు.

భూములను ఆక్రమించడానికే జ‌గ‌న్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింద‌ని సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. చివరికి ఏపీకి ఒక్క‌ రాజధాని కూడా లేకుండా చేశార‌ని మండిప‌డ్డారు. అమరావతిని నిర్మించుకోవాలంటే జ‌గ‌న్ ప్రభుత్వాన్ని మార్చాల్చిందేన‌న్నారు. అలాగే అధికారాన్ని అడ్డంపెట్టుకొని రూ.కోట్లు ఎలా వెనకేసుకుందామా అనే ఆలోచనే తప్ప వైఎస్సార్సీపీ నేత‌ల‌కు మ‌రో ఆలోచ‌న ఉండ‌టం లేద‌ని నిప్పులు చెరిగారు.

ఉపాధి హామీ ప‌థ‌కంలోనూ అవినీతి జ‌రిగింద‌ని సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు. పంచాయతీల నిధులు దారి మళ్లించడం, జలజీవన్‌ మిషన్‌ నిధుల్ని ఖర్చుపెట్టకపోవడం, కార్పొరేషన్‌లు సృష్టించి అప్పులు తేవడం, టెండర్‌ వేయడానికి ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాకపోవడమేనా ఆర్థికంగా బాగుండమంటే అని సోము జ‌గ‌న్ ప్రభుత్వాన్ని నిల‌దీస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబును మొద‌టి నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వ‌చ్చిన సోము వీర్రాజు ఇప్పుడు స‌డెన్ గా ఆయ‌న‌ను దార్శనికుడు అని పొగ‌డటం వెనుక కార‌ణాలు ఏమై ఉంటాయా అని చ‌ర్చ జ‌రుగుతోంది.

అందులోనూ ఇటీవ‌ల భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చిన‌ప్పుడు ఆ స‌భ‌కు టీడీపీని కూడా ఆహ్వానించారు. అంతేకాకుండా తాజాగా ఆగ‌స్టు 6న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న వేడుక‌ల‌కు కూడా చంద్ర‌బాబుకు ఆహ్వానం అందింది. ఈ నేప‌థ్యంలో సోము వీర్రాజు తాజా వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.
Tags:    

Similar News