సోము వ‌ర్సెస్ సీమ నేత‌లు.. ఏం జ‌రిగింది..?

Update: 2021-06-17 11:30 GMT
బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు శైలి అంద‌రికీ తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడ‌డం ఆయ‌న నైజం. ఈ క్ర‌మంలో ఎవ‌రు ఏమ‌నుకుంటార‌నే విష‌యాన్ని కూడా ఆయ‌న ప‌ట్టించుకోరు. ఈ వీక్‌నెస్సే.. ఆయ‌న‌కు మైన‌స్సుగా మారిపోయింది. ఇదే ఆయ‌న‌ను పార్టీలోని సీనియ‌ర్ల‌కు కూడా దూరం చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం బీజేపీ పుజుకోవాల‌నే ల‌క్ష్యం ఎక్క‌డా నెర‌వేర‌డం లేదు. ఎవ‌రికి వారు జ‌పం చేస్తున్నార‌నే త‌ప్ప జ‌నాల్లోకి వెళ్ల‌డం లేదు.

దీని పై ఇటీవ‌ల వ‌ర్చువ‌ల్‌గా బీజేపీ నేత‌లు.. చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో రాయ‌ల‌సీమ నేత‌ల‌తో సోము మాట్టాడుతూ..``మీ ప్రాంతంలో బీజేపీకి ప‌ట్టు ఎక్కువ‌గా ఉంది. నేను చేసిన ప‌ర్య‌టన‌ల్లోనూ ఇది స్ప‌ష్టం గా క‌నిపించింది. ఇక‌, మీదే ఆల‌స్యం. ఈ ప్రాంతంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే పార్టీ బ‌ల‌ప‌డాలి. లేక‌పోతే.. మీదే త‌ప్పు!``అని అనేసి చేతులు ముడుచుకున్నారు. దీంతో సీమ బీజేపీ నేత‌లు.. సోము పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారు. త‌మ‌దే త‌ప్పు! అన్న మాట‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని అన్నారట‌!

అంతేకాదు.. క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామ‌ని మ‌నం గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామ‌ని.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీని పై ఒక్క‌మాట కూడా మాట్లాడ‌డం కానీ.. ఒక్క అడుగు ముందుకు వేయ‌డం కానీ చేయ‌లేక పోయామ‌ని.. మ‌రి.. దీనికి ఎవ‌రిని బాధ్యుల‌ను చేయాల‌ని నిల‌దీశార‌ట‌. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేయాల్సిన కొంద‌రు నేత‌లు.. జ‌గ‌న్‌ పై ఒక్క‌మాట కూడా అన‌డం లేద‌ని.. మ‌రి వీరిని క‌ట్ట‌డి చేయాల్సిన పార్టీ పెద్ద‌లు మౌనంగా ఉన్నార‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాలో చెప్పాల‌ని నిల‌దీసేస‌రికి.. సోము అర్ధాంత‌రంగా మీటింగ్ ముగించుకుని వెళ్లిపోవ‌డం కొస‌మెరుపు.

ఈ విష‌యం ఇప్పుడు ఆ నోటా ..ఈ నోటా మిగిలిన బీజేపీ నేత‌ల చెవిన ప‌డేస‌రికి దీని గురించే వారు ప్ర‌ధానంగా చర్చించుకుంటున్నార‌ట‌. మ‌రి కొంద‌రు అయితే సోము దూకుడుగా మాట్లాడి ప‌రువు పోగొట్టుకున్నార‌ని చెవులు కొరుక్కుంటున్నారు.
Tags:    

Similar News