ప‌ద‌వి కోల్పోతున్న సోమువీర్రాజు!

Update: 2021-05-14 05:06 GMT
ఆంధ్రప్రదేశ్ బీజేపీ  రాష్ట్ర‌ అధ్యక్షుడు సోము వీర్రాజు త‌న ప‌ద‌విని కోల్పోతున్నారు. అయితే.. ఆయ‌న కోల్పోతున్న బీజేపీ అధ్య‌క్ష పోస్టు కాదు.. ఎమ్మెల్సీ ప‌ద‌వి! చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు.. కొంద‌రు మ‌రిచిపోయి ఉండొచ్చు గానీ.. రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా కూడా ఉన్నారు సోమూ! బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఆయ‌న రాష్ట్ర అధ్య‌క్షుడిగానే ఫేమ‌స్ అయ్యారు. ఇప్పుడు ప‌ద‌వీకాలం ముగుస్తుండ‌డంతో.. మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్ర‌మే గెలుచుకుంది. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ మ‌ద్ద‌తుతో ఎమ్మెల్యే కోటాలో సోమూ వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు. 2015లో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. మే 31తో ఆయ‌న ప‌ద‌వీకాలం ముగుస్తోంది.

సోము వీర్రాజుతోపాటు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం కూడా ముగుస్తోంది. వారిలో టీడీపీ సభ్యుడు.. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మొహద్ అహ్మద్ షరీఫ్, వైసీపీ సభ్యుడు దేవసాని చిన్న గోవింద్ రెడ్డి ఉన్నారు. వీరు కూడా మే 31 త‌ర్వాత మాజీ ఎమ్మెల్సీలు కానున్నారు.

అయితే.. మండలి చైర్మ‌న్ ష‌రీఫ్ ప‌ద‌వికాల ముగియ‌డం అధికార పార్టీకి ఊర‌ట క‌లిగించే అంశం కానుంది. కౌన్సిల్‌లో మూడు రాజధానుల బిల్లులు, ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ బిల్లును ఆమోదించడానికి ప‌లు అడ్డంకులు ఎదురైన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు సూచనల మేర‌కే ఇలా చేశార‌నే విమ‌ర్శ‌లు కూడా ఎదుర‌య్యాయి. అందువ‌ల్ల‌.. ఆయ‌న మండ‌లి నుంచి వెళ్లిపోవ‌డం వైసీపీ పెద్ద ఉప‌శ‌మ‌న‌మేన‌ని అంటున్నారు. ఈ మూడు స్థానాల‌కు త్వ‌ర‌లో ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీలో భారీ సంఖ్యా బ‌లం క‌లిగిన వైసీపీ.. ఈ మూడు స్థానాల‌ను తేలిగ్గా గెలుచుకోనుంది.

కాగా.. తెలంగాణ‌లోనూ ప‌లువురు ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. వీరిలో శాసనమండలి చైర్మన్ గుతా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, అకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరంతా అధికార టీఆర్ఎస్ స‌భ్యులే కావడం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News