సోనియాతో రాహుల్.. నెట్టింట వైర‌ల్ గా ఆ పిక్‌!

Update: 2022-10-06 08:30 GMT
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర చురుకుగా సాగుతోంది. త‌మిళ‌నాడులోని కన్యాకుమారిలో ప్రారంభ‌మైన ఈ యాత్ర అక్క‌డ ముగిశాక కేర‌ళ‌లో జ‌రిగింది. అక్క‌డ కూడా ముగిశాక ప్ర‌స్తుతం కర్ణాట‌క‌లో సాగుతోంది.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌కు గ‌ట్టి ప‌ట్టుంది. ప్ర‌స్తుతం ఆ పార్టీ క‌ర్ణాట‌క‌లో బ‌లంగా ఉంది. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో దాదాపు 28 రోజులు క‌ర్ణాట‌క‌లోనే రాహుల్ గాంధీ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. క‌ర్ణాట‌క కాంగ్రెస్ క‌మిటీ రాహుల్ యాత్ర‌కు గ‌ట్టి ఏర్పాట్లు చేసింది. సెప్టెంబ‌ర్ 30న రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లో ప్ర‌వేశించారు.

కాగా ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని రెండు రోజులు త‌న యాత్ర‌కు రాహుల్ గాంధీ విరామం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల విరామం త‌ర్వాత రాహుల్ గాంధీ పాద‌యాత్ర అక్టోబ‌ర్ 6న మ‌ళ్లీ తిరిగి పున‌:ప్రారంభ‌మైంది. మాండ్య జిల్లాలోని పాండ‌వ‌పురాలో రాహుల్ గాంధీ త‌న యాత్ర‌ను పున:  ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ రాహుల్ ను క‌లుసుకున్నారు.

సోనియా గాంధీ.. రాహుల్ పాద‌యాత్ర‌కు హాజ‌రుకావ‌డంతో ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. క‌ర్ణాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్, ప్ర‌తిప‌క్ష నేత సిద్ధ‌రామ‌య్య స‌హా ఆ పార్టీ అగ్ర నేత‌లంతా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దారి పొడవునా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు.

కాగా ఇటీవ‌ల కేర‌ళ‌లో త‌న‌ను క‌ల‌సిన బాలిక షూ ఊడిపోవ‌డంతో రాహుల్ ఆమెకు షూ తొడిగిన విష‌యం తెలిసిందే. ఆ చిత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇప్పుడు తాజాగా త‌న త‌ల్లి సోనియా గాంధీ షూ లేసు ఊడిపోవ‌డంతో రాహుల్ గాంధీ.. సోనియా గాంధీ షూ లేసు క‌ట్టారు. ఈ చిత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అలాగే గ‌తంలో మైసూరులో రాహుల్ గాంధీ నిర్వహించిన బహిరంగ సభ నెటిజన్లను ఆకట్టుకుంది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు సోనియా గాంధీకి షూ లేసు క‌ట్టిన ఫొటోలు కూడా అంతే వైర‌ల్ గా మారాయి.

త‌న కుమారుడు రాహుల్ గాంధీని క‌ల‌వ‌డానికి ముందు సోనియా గాంధీ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. మాండ్యలో చేపట్టిన యాత్రలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా.. తనయుడి వెంట హుషారుగా ఆమె యాత్రలో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం సోనియా గాంధీ వ‌య‌సు 75 ఏళ్లు కావ‌డం గ‌మ‌నార్హం. భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడం కోసం సోనియా గాంధీ రెండు రోజుల క్రిత‌మే మైసూర్‌ చేరుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News