ఇక సోనియమ్మ వంతుట : గాంధీలతోనే చెలగాట

Update: 2022-06-21 02:30 GMT
కాంగ్రెస్ లో వేడి పుడుతోందా లేక పుట్టిస్తున్నారా . తమకు సిసలైన ప్రత్యర్ధి అలా చతికిలపడితే ఆటలో మజా ఏముంది అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ బీజేపీ వారు మాత్రం శతాధిక కాంగ్రెస్ మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ని దాని మానాన వదిలేస్తే ఏమో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇపుడు అధినాయకత్వాన్నే టచ్ చేశారు. గాంధీలతోనే చెలగాటమాడుతున్నారు అని అంటున్నారు.

రాహుల్ గాంధీని ఈడీ ముందు పిలిచి రోజుల తరబడి విచారిస్తున్నారు. అయితే సోనియా గాంధీ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోజుల తరబడి అక్కడే ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ శ్రేణుల ప్రార్ధనలతో పాటు దేశ ప్రజల దీవెనల ఫలితంగా ఆమె తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చారు.

దాంతో ఈడీ చూపు సోనియమ్మ మీద కూడా పడుతుంది అని అంటున్నారు. ఈ మేరకు ప్రచారం సాగడంతో కాంగ్రెస్ ఒక్క సారిగా అలెర్ట్ అయింది. దేశం నలుమూలలలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ పెద్దలను ఢిల్లీకి రప్పించి బీజేపీ గుండెలు అదిరేలా జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాలని డిసైడ్ చేసింది. దాంతో చలో ఢిల్లీ అంటూ దేశంలోని ఖద్దరు పార్టీ నేతలు కదులుతున్నారు.

సోనియా గాంధీని కూడా ఈడీ విచారణకు పిలిపించడం ఖాయమని ఇప్పటికే ప్రచారం సాగుతూ వచ్చింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసు విషయంలో ఈడీ రాహుల్ ని సుదీర్ఘంగా విచారిస్తోంది. దాంతో ఇపుడు సోనియా వంతు అని అంటున్నారు. ఆమె కనుక ఈడీ ముందు హాజరు అయితే అది పెను సంచలనమే అవుతుంది అని కూడా అంటున్నారు.

అయితే కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చాలన్న రాజకీయ వ్యూహంతోనే ఇలా చేస్తున్నారు అని ఆ పార్టీ వారు మండిపడుతున్నారు. దీన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని సోనియా గాంధీ ఇంటికి చేరుకుంటూనే యుద్ధ సన్నాహాలు మొదలెట్టారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిరసన  తరువాత రాజకీయంగా ఢీ కొట్టే పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.

ఏది ఏమైనా రాహుల్ ఈడీ ముందు కూర్చున్నా కాంగ్రెస్ శ్రేణులలో పెద్దగా వేడి పుట్టలేదు, ఇపుడు సోనియమ్మకే గురి పెడుతున్న వేళ అయినా అంతా కలసి గర్జిస్తారా. అధికార పార్టీ మీద సంఘర్షిస్తారా. అలా కాదు కూడదు అనుకుంటే మాత్రం కాంగ్రెస్ పస అంతా బుసలు కొట్టడానికే పరిమితం అని మరిన్ని అడుగులు వడివడిగా ముందుకు పడతాయి. అపుడు జాతీయ రాజకీయం పూర్తిగా ఏకపక్షం కాక తప్పదు.
Tags:    

Similar News