రాహుల్ తో కలిసి విదేశాలకు సోనియా... రీజనేంటంటే?

Update: 2020-09-13 10:30 GMT
సరిగ్గా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయనగా... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాయబరేలీ ఎంపీ సోనియా గాంధీ విదేశీ యానానికి బయలుదేరారు. తనతో తన కుమారుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ వెంట రాగా.... శనివారం సోనియా గాంధీ విదేశీ యానానికి వెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న సోనియా... తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు ఆమె విదేశాలకు వెళ్లినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సోనియా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు అయితే హాజరు కాలేరని కూడా ఆ పార్టీ పేర్కొంది.

ఇదిలా ఉంటే... తల్లితో పాటు విదేశీయానానికి బయలుదేరిన రాహుల్ గాంధీ వారం రోజుల్లోగా తిరిగి భారత్ వస్తారట. ఆ తర్వాత అందరు ఎంపీల్లాగే రాహుల్ కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారట. ఇక ఈ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేకపోయినప్పటికీ..... ఇప్పటికే పార్టీ నేతలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ తదితర అంశాలపై మోదీ సర్కారును ఇరుకున పెట్టాలని సోనియా తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారట.

ఇక సోనియా అనారోగ్య విషయానికి వస్తే... ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన నేపథ్యంలో విదేశాలకు వెళ్లి చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి భారత్ వచ్చిన సోనియా... పలుమార్లు సర్ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లారు. రోటీన్ గా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల కోసమైనా, లేదంటే... ఏ చిన్న నలత అయినా సోనియా గంగారామ్ ఆసుపత్రికే వెళుతున్నారు. ఇటీవల కూడా ఆమె ఈ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మొత్తంగా అనారోగ్యంతో సోనియా గతంలో పనిచేసినంత చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. మరి ఈ విదేశీ పర్యటనలో వైద్య పరీక్షలు, చికిత్స తర్వాత అయినా ఆమె మరింత యాక్టివ్ గా పనిచేయాలని కోరుకుందాం.
Tags:    

Similar News