ఆ హీరోయిన్ మ‌ర‌ణానికి అత‌డే కార‌ణ‌మ‌ట‌

Update: 2018-01-31 07:07 GMT
ఆత్మ‌హ‌త్య‌తో దేశం యావ‌త్తు షాక్ కు గుర‌య్యేలా చేసింది బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ సూసైడ్ ఎపిసోడ్‌. త‌న కుమార్తె ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని ఆమె త‌ల్లి స్ప‌ష్టం చేయ‌టంతో పాటు.. త‌న కుమార్తె మ‌ర‌ణానికి కార‌ణం ఆమె ప్రియుడు.. యువ హీరో సూర‌జ్ పాంచోలీనేన‌ని పేర్కొన‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.

 ఇదిలా ఉంటే.. తాజాగా జియా త‌ల్లి మాటే నిజ‌మ‌న్న విష‌యాన్ని ముంబ‌యి సెష‌న్స్ కోర్టు స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఒక‌వేళ‌.. కోర్టు పేర్కొన్న‌ట్లు సూర‌జ్ పాంచోలీ నేరం కానీ రుజువైన ప‌క్షంలో.. అత‌డికి గ‌రిష్ఠంగా ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే వీలుంద‌ని చెబుతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ నిర్మించిన  ‘నిశబ్ధ్‌’ సినిమాతో ప‌రిచ‌య‌మైన జియాఖాన్ అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. త‌న తీరుతో త‌ర‌చూ వార్త‌ల్లో ఉండే జియాఖాన్ కొంత‌కాలం బాలీవుడ్ సంచ‌ల‌నంగా అభివ‌ర్ణించే వారు. అలాంటి ఆమె 2013, జూన్‌ 3న జుహూలోని తన ఫ్లాట్‌ లో ఫ్యాన్‌ కు ఉరివేసుకుని చనిపోయింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని.. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపించారంటూ ఆమె ప్రియుడు సూర‌జ్ పాంచోలీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఇదిలా ఉండ‌గా.. జియాఖాన్ ఆత్మ‌హ‌త్య కేసు విచార‌ణ‌లో సీబీఐ స‌మ‌ర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్ట‌ర్ ఇచ్చిన రిపోర్ట్ కీల‌కంగా మారిన‌ట్లు చెబుతున్నారు. జియా.. సూర‌జ్ ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్న నేప‌థ్యంలో జియా గ‌ర్భ‌వ‌తి అయ్యింది. దీన్ని ఒప్పుకోని సూర‌జ్ ఆమెను అబార్ష‌న్ చేసుకోవాల‌ని బ‌ల‌వంతం చేశాడు. ఇదే జియా సూసైడ్‌ కు కార‌ణంగా డాక్ట‌ర్ నివేదిక తేల్చిన‌ట్లు చెబుతున్నారు.

స‌గం పిండం ఆమె క‌డుపులో ఉండిపోయిందన్న అంశంతో పాటు.. అబార్ష‌న్ కోసం పిల్ వేసుకున్న అనంత‌రం విచ్ఛిత్తి అయిన పిండం స‌గం క‌డుపులోనే ఉంద‌న్న విష‌యాన్ని కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ కు ఫోన్ చేసిన సూర‌జ్‌.. స‌గం చెత్త ఆమె క‌డుపులో ఉండిపోయిన‌ట్లు పేర్కొన్న‌ట్లు తెలిపారు. అనంత‌రం వారు ఆసుప‌త్రికి వ‌చ్చి చికిత్స చేయించుకున్న‌ట్లు చెప్పారు. త‌న సూసైడ్ లేఖ‌లోనూ జియా.. అబార్ష‌న్ విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది.

"నన్ను నీకు పూర్తిగా స‌మ‌ర్పించుకున్నాను. కానీ.. నువ్వు అనుక్ష‌ణం న‌న్ను బాధ‌పెట్టావు. నా అణువ‌ణువూ నాశ‌నం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డ‌ను చంపుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఎంత క్షోభ‌ప‌డ్డానో నీకు అర్థం కాదు" అని జియా రాసుకున్నారు. జియా మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ అది ఆత్మ‌హ‌త్యేన‌ని ముంబ‌యి పోలీసులు చార్జిషీటు సిద్ధం చేశారు. అనంత‌రం ఈ కేసు సీబీఐకి బ‌దిలీ అయ్యింది. ఈ కేసును అన్ని కోణాల్లో ద‌ర్యాప్తుచేసిన సీబీఐ.. జియాది ఆత్మ‌హ‌త్యేన‌ని..కాకుంటే ఆమె సూసైడ్ చేసుకునేందుకు ప్రేరేపించింది మాత్రం సూర‌జేన‌ని తేల్చింది.

సూర‌జ్ తో స‌హ‌జీవ‌నం చేసిన స‌మ‌యంలో జియా.. అత‌డి దుస్తులు ఉత‌క‌టం.. ఇస్త్రీ చేయ‌టం.. వంట చేసి పెట్ట‌టం లాంటివి చేసిన‌ట్లు పేర్కొన్నారు.  త‌న కుమార్తె మ‌ర‌ణంలో సూర‌జ్ పాత్ర ఉంద‌ని ఆరోపించిన జియా త‌ల్లి.. కోర్టు తాజా వ్యాఖ్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తాము చేస్తున్న నాలుగేళ్ల పోరాటం ఫ‌లించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. దేశంలో న్యాయం ఇంకా బ‌తికే ఉంద‌ని వ్యాఖ్యానించారు. త‌న కుమార్తె ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్రేరేపించాడ‌నే కంటే.. హంత‌కుడిగా గుర్తించి ఉంటే మ‌రింత హ్యాపీగా ఉండేదానిన‌ని ఆమె పేర్కొన‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News