పేర్ని నాని నోట 'వెయిటింగ్' మాటతో దెబ్బేనట

Update: 2022-10-18 05:16 GMT
పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడటానికి సిద్ధంగా ఉండే నేతల్లో పేర్ని నాని ఒకరు. సీనియర్ నేతగా.. కాస్తంత పద్దతి కలిగిన వ్యక్తిగా పేరున్న ఆయనకు.. 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వంలో వచ్చిన మంత్రి పదవి ఆయన మాటల్నే కాదు చేతల్ని మార్చేసిందంటారు.

అవసరం ఉన్నా లేకున్నా అధినేత మెప్పు కోసం పవన్ పై విరుచుకుపడటం.. ఆ సందర్భంలో ఆయన మాటల్లో మర్యాద పూర్తిగా మిస్ కావటంపై పలువురు గుర్రుగా ఉన్నారు. పవన్ స్థాయి ఏమిటి? పేర్నినాని స్థాయి ఏమిటన్న విషయాన్ని బొత్తగా మర్చిపోయి అవాకులు చవాకులు పేలుతున్న తీరుపై సొంత నియోజకవర్గంలోనే ఆగ్రహం వ్యక్తమవుతోందని చెబుతున్నారు.మంత్రి పదవి ఉన్నప్పుడు డైలీ బేసిస్ లో చెలరేగిపోయే ఆయన.. పదవి పోయిన తర్వాత టోన్ కాస్త తగ్గిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలతో మరోసారి తెర మీదకు వచ్చిన ఆయన.. అలవాటులో భాగంగా పవన్ మీద విరుచుకుపడ్డారు. పవన్ మాటల్ని ఉటంకిస్తూ ఆయన ఎటకారం చేసేశారు. ఎప్పటిలానే పవన్ మూడో పెళ్లిని ప్రస్తావించటం ద్వారా.. తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు పేర్ని నాని. పవన్ మీద మాట్లాడటానికి మరేమీ లేదన్న రీతిలో ఆయన మాటలు ఉండటం తెలిసిందే.

తాము ఇక్కడే ఉండి పోరాడతామని..జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 'వైసీపీ వాళ్లకు ఆయన బలంగా చెబుతున్నారట. చాలా బలంగా. ఇక్కడే ఉంటా. ఎదుర్కొంటా. పవన్ కల్యాణ్ కు కూడా బలంగా చెబుతున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ ఆఫీసు నుంచి. ఎస్..వెయిటింగ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్. చంద్రబాబు.. బీజేపీ.. నువ్వు.. కమ్యునిస్టు పార్టీలు.. కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి రండి. వెయిటింగ్' అంటూ మాట్లాడిన పేర్ని మాటల్లో అహంకారమే ధ్వనించింది తప్పించి.. మరేమీ లేదంటున్నారు.

పవన్ కల్యాణ్ వాడిన 'బలంగా' మాటకు బదులుగా మరో మాటను ప్రస్తావించలేని పేర్ని నాని.. జనసేనానిని ఎదుర్కొంటానని చెప్పటంలో హాస్యాస్పదమంటున్నారు. అదెలానంటే.. ప్రతిపక్షంలో ఉండి.. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటూ బలంగా ఎదుర్కొంటామనే మాటల్లో 'బలం' కనిపిస్తే.. అధికారం అరచేతిలో ఉన్న వేళలో.. పార్టీ పేరు చెప్పుకొని వెయిటింగ్ అంటూ బలాన్ని చూపించుకోవాలనుకునే పేర్ని తాపత్రంలో 'బలం' కంటే 'బలహీనతే' కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందంటున్నారు.

పేర్ని నాని మాటల్లోని అహంకారం పార్టీకి ప్రతికూలంగా మారటంతో పాటు.. జగన్ కు సైతం ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. పేర్ని మాటలకు సమాధానం 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితంతో స్పష్టం కావటం ఖాయం. అప్పటివరకు ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా వెయిటింగేనని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News