షాకింగ్ః ద‌క్షిణాఫ్రికాలో ఏడాది క్రికెట్ లేదు

Update: 2016-04-26 03:58 GMT
ద‌క్షిణాఫ్రికా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశంలో ఏడాది పాటు క్రికెట్.. ర‌గ్బీ అంత‌ర్జాతీయ మ్యాచులేవీ నిర్వ‌హించ‌కుండా నిషేధం విధించింది. ఈ రెండు క్రీడ‌ల్లో జాతి వివ‌క్ష న‌డుస్తుండ‌ట‌మే ఈ నిర్ణ‌యానికి కార‌ణం. క్రికెట్‌, రగ్బీ క్రీడ‌ల్లో నల్లజాతీయులకు అవ‌కాశ‌మివ్వ‌కుండా.. తెల్ల జాతీయుల‌కే పెద్ద పీట వేస్తుండ‌టంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు ద‌క్షిణాఫ్రికాలో టోర్న‌మెంట్లు.. మేజ‌ర్ మ్యాచ్ లు ఏవీ నిర్వ‌హించ‌కుండా ఆయ‌న నిషేధం విధించారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్‌బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని.. కాబట్టి ఆ ఆట‌కు నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు.

ద‌క్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివ‌క్ష ఆరోప‌ణ‌లు ఈనాటివి కావు. దీనికి సంబంధించిన వివాదంతోనే ఆ జ‌ట్టు దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు అంత‌ర్జాతీయ క్రికెట్ కు దూర‌మై 1992లో పున‌రాగ‌మ‌నం చేసింది. గ‌త కొన్నేళ్లుగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో తెల్ల జాతీయుల‌దే ఆధిప‌త్యం. ఒక‌రో ఇద్ద‌రో మిన‌హాయిస్తే న‌ల్ల జాతీయులు జ‌ట్టులో ఉండ‌ట్లేదు. ప్ర‌స్తుత జ‌ట్టులో ర‌బాడ ఒక్క‌డే న‌ల్ల జాతీయుడు. నిషేధం క‌చ్చితంగా అమ‌ల‌వుతుంద‌ని.. ఏడాది త‌ర్వాత స‌మీక్ష జ‌రిపి నిషేధం కొన‌సాగించాలా ఎత్తేయాలా అన్న‌ది నిర్ణ‌యిస్తామ‌ని ఎంబాలులా తెలిపాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా సొంత‌గ‌డ్డ‌పై ఏడాది పాటు అంత‌ర్జాతీయ మ్యాచులేవీ ఆడ‌ద‌న్న‌మాట‌. దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News