దావోస్ వీధుల్లో తిరుగుతున్న ‘‘ఏపీ బస్సు’’

Update: 2016-01-18 04:35 GMT
నిజమే.. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగర వీధుల్లో ఏపీ బస్సు తిరుగుతోంది. ఏపీ గురించి ప్రచారం చేస్తూ.. ఏపీలో పెట్టుబడుదారులకు ఉన్న అవకాశాల గురించి తెలియజేస్తూ.. పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రచార రథాన్ని తయారు చేశారు. ‘‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ నినాదంతో తిరుగుతున్న బస్సుకు ఏపీ పరిశ్రమల శాఖ హోర్డింగ్ లను ఏర్పాటు చేసింది.

ఈ నెల 20 నుంచి 23 వరకూ దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ ముద్ర కనిపించేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వీలుగా ఆయన తాజా విదేశీ యాత్రను చేస్తున్నారు. దావోస్ లో జరగనున్న సదస్సు ద్వారా ఏపీకి లబ్థి చేకూరేలా చేయాలని బాబు తలపోస్తున్నారు. ఈ సదస్సుకు వచ్చే పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రచార రథాన్ని.. ఏపీ రాజధాని ఊహా చిత్రంతో పాటు.. పారిశ్రామిక పెట్టుబడులకు కల్పిస్తున్న వాతావరణానికి సంబంధించిన వివరాల్ని బస్సుపై ఏర్పాటు చేశారు.

బస్సుతో ప్రచారంతో పాటు.. దావోస్ సదస్సు ప్రాంగణంలో ఏపీకి సంబంధించిన ప్రత్యేక లాంజ్ ను ఏర్పాటు చేశారు. సన్ రైజ్ ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక లాంజ్ లో ఏపీలోని అవకాశాల గురించిన వివరాలతో పాటు.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి తమ ప్రభుత్వం కల్పించే వసతులు.. సౌకర్యాల గురించి వివరాల్ని అందించే ఏర్పాట్లు చేశారు. మరి.. దావోస్ వీధుల్లో తిరుగుతున్న బస్సు..ప్రత్యేక లాంజ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలతో ఏపీకి ఎంత భారీగా పెట్టుబడులు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News