మిస్ వరల్డ్ పోటీలంటే... ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించే పోటీ. జగత్తు మెచ్చే అందంతో పాటు సమయస్ఫూర్తితో వ్యవహరించే నైజం ఉన్న వారినే మిస్ వరల్డ్ కిరీటం వరిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటిదాకా భారత్ తరఫున మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లిన లారా దత్తా, ఐశ్వర్యారాయ్ తదితర మేటి అందగత్తెలు ఆ కిరీటాన్ని దేశానికి తీసుకొచ్చారు. ఈ పోటీల్లో తెలుగు నేలకు చెందిన యువతులు పెద్దగా రాణించిన దాఖలా లేదు. అయితే ఇకపై ఈ తరహా వెలితి మనకు ఉండబోదు. ఎందుకంటే... మన తెలుగు నేలకు చెందిన ఓ అమ్మాయి మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అయిపోతోంది. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాలుపంచుకోవడమే కాకుండా... విజేతగా నిలిచిన ఆ అమ్మాయి ఈ దపా మిస్ వరల్డ్ పోటీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనుందన్న వాదన వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావ్య కల్యాణపు (21) కెనడా అందాల పోటీల్లో సత్తా చాటుతోంది. ప్రాథమిక విద్యను ఇక్కడే పూర్తి చేసిన శ్రావ్య... 2005లో కుటుంబంతో పాటు కెనడాకు వలస వెళ్లింది. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం కొనసాగిస్తున్న శ్రావ్య... ఇప్పుడు యూనివర్సిటీ ఆప్ ఆల్బెర్టాలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తూనే... మరోవైపు లిప్‌స్టిక్ తయారీ కంపెనీని ప్రారంభించిన శ్రావ్య... బ్యూటీ విత్ బ్రెయిన్‌గా అక్కడి తెలుగు వారి మనసులను చూరగొంది. అంతేకాదండోయ్... విద్య, కంపెనీ వ్యవహారాలను చూసుకుంటూనే అందాల పోటీల వైపు కూడా శ్రావ్య ఓ కన్నేసింది. కన్నేయడంతోనే ఆగిపోని ఆమె... ఇటీవలే *మిస్ నార్తర్న్ వరల్డ్ 2017* కిరీటాన్ని కూడా ఎగురవేసుకుపోయింది.
ఇక ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల్లో కెనడా తరఫున బరిలోకి దిగే వారి ఎంపిక కోసం జరుగుతున్న మిస్ వరల్డ్ కెనడా పోటీలకు ఆమె సిద్ధమవుతోంది. అందంతో పాటు ఇతర విషయాల్లోనూ ఇప్పటికే రాటుదేలిన శ్రావ్య... మిస్ వరల్డ్ కెనడా పోటీల్లోనూ విజయం సాధించి మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించడం ఖాయమేనని అక్కడి తెలుగు వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా... తెలుగు వారు తమదైన శైలిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న దరిమిలా... శ్రావ్య కూడా మిస్ వరల్డ్ కెనడా పోటీలో విజయం సాధించడంతో పాటు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకోవాలని మనం కూడా ఆశిద్దాం.