ఒకవైపు సంక్షోభం మరోవైపు క్యాసినోలా ?

Update: 2022-07-30 03:39 GMT
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్దితులు చాలా విచిత్రంగా ఉంటోంది. ఒకవైపు యావత్ దేశం ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వంపై మండిపోయిన జనాలు గడచిన ఐదునెలలుగా పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. జనాగ్రహానికి భయపడిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని వదిలేసి కుటుంబంతో పాటు విదేశాలకు పారిపోయారు. ఈయనతో పాటు అనేకమంది మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా పారిపోయారు.

శ్రీలంకలో జనాలకు రెండు పూటలా తినటానికి కూడా తిండి దొరకడం లేదు. అత్యవసర వైద్యానికి మందులు లేకపోవటంతో ఆపరేషన్లు నిలిచిపోయాయి. విద్యుత్ లేదు, నిత్యావసరాలు దొరకటం లేదు. ఎక్కడైనా నిత్యావసరాలు దొరికినా ధరలు ఆకాశానికి ఎగబాకాయి. పెట్రోలు, డీజల్, కిరోసిన్ దొరకటమే కష్టంగా ఉంది. రోజులో గంటల తరబడి కరెంటే ఉండటం లేదు. అందుకనే లక్షలాది జనాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

సీన్ కట్ చేస్తే నాణానికి మరో వైపు మాత్రం సకల విలాసాలతో హ్యాపీగా కొంతమంది జనాలు ఉన్నారు. అంత హ్యాపీగా ఉన్న జనాలెవరయ్యా అంటే క్యాసినోలు ఆడేందుకు విదేశాల నుండి శ్రీలంకలో అడుగుపెడుతున్నవారు మాత్రమే.

విదేశాలంటే ముఖ్యంగా ఇండియా అనే అనుకోవాలి. హైదరాబాద్-శ్రీలంక రాజధాని కొలంబోకు విమానంలో రెండు గంటల ప్రయాణం. అందుకనే బాగా డబ్బున్నవాళ్ళంతా రాత్రిళ్ళు కొలంబోకు వెళ్ళి క్యాసినోలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఉదయానికి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటున్నారట. రాత్రిళ్ళు మాత్రమే ఎందుకు వెళుతున్నారంటే కొలంబోలో క్యాసినోలు రాత్రిళ్ళు మాత్రమే ఎక్కువగా బిజీగా ఉంటాయట.

క్యాసినోల్లో పార్టిసిపేట్ చేసేందుకు జనాలు వస్తున్నారంటే వాళ్ళ అవసరాలు తీర్చే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాలి కదా. ఇందులో భాగంగానే పార్టిసిపెంట్లకు అవసరమైన విందులన్నీ యథావిధిగా కొలంటో క్యాసినోలు అమరుస్తున్నాయి.

అంటే ఒకవైపు లక్షలాది మంది ప్రజలు ఒక్కపూట తిండికే నానా అవస్థలు పడుతుంటే మరోవైపు క్యాసినో నిర్వాహకులు మాత్రం తమ అతిధులకు విందు భోజనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు అర్ధమవుతోంది.
Tags:    

Similar News