షాకిచ్చిన శ్రీనివాస్ గౌడ్.. దేత్తడి హారిక ఎవరో తెలీదు

Update: 2021-03-11 03:30 GMT
ఏ ముహుర్తంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక నియమితులయ్యారో.. అప్పటి నుంచి ఆమె మీద మీడియాలో మొదలైన వార్తలు.. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా మారాయి. నేను.. నా సోషల్ మీడియా అన్నట్లుగా బతికే ఆమెను బజార్లో నిలబెట్టాయి.  బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెకు ఏమిస్తానన్నారో తెలీదు కానీ.. ఆ డీల్ ఓకే అన్నందుకు ఆమె రకరకాలుగా టార్గెట్ కావాల్సిన పరిస్థితి.

అందరం కలిసే నిర్ణయం తీసుకున్నామని టూరిజం శాఖ ఎండీ శ్రీనివాస్ గుప్తా చెబుతుంటే.. అందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు కానీ ఉన్నతాధికారులకు కానీ ఎలాంటి సమాచారం లేదన్నారు. హారిక నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళలో ఆయన స్పందించారు.

అసలు తనకు దేత్తడి హారిక అంటే కూడా ఎవరో తెలీదన్న ఆయన.. తాను ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. తొందరలోనే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. దీని వెనుక ఎవరున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఒక మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తానమని వెల్లడించారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. మంత్రి నోటి నుంచి వచ్చిన మాటలు దేత్తడి హారికకు షాకింగ్ గా మారటంతో పాటు.. ఆమె జీర్ణించుకోలేనివిగా మారాయని చెప్పకతప్పదు.
Tags:    

Similar News