ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి స్టార్లే..స్టార్లు

Update: 2020-01-23 01:30 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న స్టార్ క్యాంపెయినర్ల‌ను ప్ర‌క‌టించింది. ఏకంగా 40 మంది తో ఈ స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాను ప్ర‌క‌టించింది. ఇందులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ముందున్నారు. మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందు వ‌ర‌స‌లో ఉన్నారు.

ఇక సినీ సెల‌బ్రిటీలు క‌మ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు ఈ స్టార్ క్యాంపెయిన‌ర్ హోదాల్లో ఉన్నారు. సినీ న‌టి, బీజేపీ ఎంపీ అయిన హేమ‌మాలిని, ఆమె స‌వతి త‌న‌యుడు, బీజేపీ ఎంపీ స‌న్నీడియోల్, మాజీ క్రికెట‌ర్ ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఈ జాబితాలో ఉన్నారు. ఇకా హ‌న్స్ రాజ్ హ‌న్స్, భోజ్ పురి న‌టుడు ర‌వి కిష‌న్, యూపీ సీఎం ఆదిత్య‌నాథ్ - కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గ‌డ్క‌రీలు.. ఈ జాబితాలో ఉన్నారు.

ఇలా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారాన్ని హోరెత్తించ‌నుంది. ఇప్ప‌టికే నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసింది. ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి.

ఢిల్లీలో ముక్కోణ‌పు పోటీ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢీ కొడుతూ ఉన్న విష‌యం తెలిసిందే. మూడు పార్టీలూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి అమీతుమీ పోరాడుతూ ఉన్నాయి. ఇక ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఏమీ ప్ర‌క‌టించుకోకుండా.. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇలా స్టార్ క్యాంపెయిన‌ర్ల మీదే ఆధార‌ప‌డి ఉంది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఢిల్లీలో స‌త్తా చూపించింది. మ‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుందో!
Tags:    

Similar News