వరంగల్ లో గ్యాంగ్ రేప్.. అసలేం జరిగింది?

Update: 2019-08-12 07:13 GMT
రెండు నెలల కిందటే కామాంధుడు ప్రవీణ్ వరంగల్ లో ఒక 9 నెలల చిన్నారిని చిదిమేయగా అతడికి ఉరిశిక్ష పడింది. వరంగల్ ప్రజల ఆందోళన, లాయర్ల సహాయనిరాకరణ.. గట్టి డిమాండ్ వినిపించడంతో నెలన్నర రోజుల్లోనే కామాంధుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అందరూ హర్షం వ్యక్తం చేశారు.

అది మరిచిపోకముందే మరో గాయం.. అదే వరంగల్ లో ముక్కుపచ్చలారని 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్. నమ్మించి తీసుకెళ్లి ముగ్గురు యువకులు చేసిన ఈ అఘాయిత్యానికి ఆ అమ్మాయి మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సమ్మయ్యనగర్ అదీ.. తండ్రి చనిపోవడం.. తల్లి వదిలి వెళ్లిపోవడంతో నానమ్మ దగ్గర ఉంటూ ఆ బాలిక స్కూలు చదువులు చదువుకుంటోంది. అదే గల్లీలో పెంబర్తికి చెందిన తిరుపతి- ప్రసన్నకుమార్- రాకేష్ లు డీజే నిర్వహిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు యువకులతో బాలికకు పరిచయం ఉంది.

అయితే ఆ పరిచయాన్ని అలుసుగా తీసుకున్న తిరుపతి- ప్రసన్న బాలిక ఇంటికి శనివారం వచ్చి ఆమెను బైక్ పై పెంబర్తిలోని ఓ తోటకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న రాకేష్ తోపాటు తిరుపతి- ప్రసన్న ముగ్గురు బాలికపై అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టి బాలికను సాయంత్రం 5.30 గంటలకు ఇంట్లో వదిలిపెట్టారు.

ఊహించని ఈ దారుణానికి ఖిన్నురాలైన బాలిక నానమ్మకు జరిగిన విషయం చెప్పి బోరుమంది. తనకు ప్రెగెన్సీ రాకుండా ఇంజక్షన్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చింది. దీంతో నానమ్మ ఈ విషయం తెల్లవారి తేల్చుదామని బాలికకు సర్ధిచెప్పింది.

అయితే బాలిక తనను నమ్మించి మోసం చేసిన యువకులతో ఆ రాత్రంతా ఫోన్లో వాదులాడుకుంది. ఏమైందో తెలియదు కానీ మరిసటి ఉదయం 7.30 గంటలకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ప్రజలు భగ్గుమన్నారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేయాలని శవంతో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపి డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , ఎమ్మెల్సీ వచ్చి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఇలా బాలికను నమ్మించి గ్యాంగ్ రేప్ చేసిన వైనం వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. అమాయకపు బాలికను నమ్మించి మోసం చేసిన యువకులకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు కోరుతున్నారు.


Tags:    

Similar News