సుబ్బారెడ్డి వ‌ర్సెస్ సుధీర్ రెడ్డి.. సీఎం ఇలాకాలో ఫైటింగ్‌!!

Update: 2021-01-14 17:30 GMT
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో వైసీపీ నాయ‌కులు ఫైట్ చేసుకుంటున్నారు. కొత్త‌, పాత నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విభేదాలు కొన‌సాగుతున్నాయి. ``నేను ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచా. నా మాటే నెగ్గాలి!`` అని ఒక‌రు అంటే.. ``జ‌గ‌న్ ఆహ్వానంతోనే నేను పార్టీలోకి వ‌చ్చా.. నాకూ హ‌క్కు ఉంది!`` అని మ‌రో నాయ‌కుడు వాదిస్తున్నారు. ఈ ప‌రిస్థితి ఇప్పుడు మ‌రింత హీటెక్కి.. వ‌ర్గ పోరుకు దారితీసింది. ఫ‌లితంగా.. వైసీపీకి ఇబ్బందికర ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విష‌యంలోకి వెళ్తే.. క‌డ‌ప జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మ‌ల‌మ‌డుగు. ఇది ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. త‌ర్వాత టీడీపీ కూడా బాగానే పుంజుకుంది. అయితే.. వైసీపీ రాక‌తో.. కాంగ్రెస్ నేత‌లు ఈ పార్టీవైపు మ‌ళ్లారు. ఈ క్ర‌మంలోనే ఆదినారాయ‌ణ‌రెడ్డి 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచారు. త‌ర్వాత కాలంలో టీడీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి అయ్యారు. ఇక‌, గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్ట‌ర్ మూలే సుధీర్‌రెడ్డి విజ‌యం సాధించారు. అయితే.. టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రామ‌సుబ్బారెడ్డి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీ బాట ప‌ట్టారు.

వాస్త‌వానికి రామ‌సుబ్బారెడ్డి టీడీపీలో సీనియ‌ర్ నేత‌.. 2004 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వ‌రుసగా రెండు సార్లు టీడీపీ జెండాను ఇక్క‌డ రెప‌రెప‌లాడించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలోకి చేరిపోయారు. అయితే.. సుబ్బారెడ్డికి సుధీర్ ఏమాత్రం విలువ ఇవ్వ‌క‌పోవ‌డం.. అన్నీ త‌నే అయి రాజ‌కీయాలు చేయ‌డం వంటివి వివాదాల‌కు కేంద్రంగా మారాయి. ఒక్క రామ‌సుబ్బారెడ్డినే కాదు.. వైసీపీలోనూ ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కేవ‌లం తాను ఎంచుకున్న వారికి మాత్ర‌మే కాంట్రాక్టులు.. ప‌నులు అప్ప‌గిస్తున్నార‌ని కేడ‌ర్ తీవ్ర అసంతృప్తితో ఉంది.

సుధీర్ రెడ్డి వ్య‌వ‌హార శైలితో రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్నారు. పోనీ.. పార్టీ అధిష్టానానికి విష‌యం చెబుదామా? అన్నాకూడా ఎవ‌రూ వినిపించుకోవ‌డం లేదు. దీంతో త‌న‌తో క‌లిసి వ‌చ్చిన వారితో ఆయ‌న ఒక గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తితో ఉన్న‌వారంతా.. కూడా రామ‌సుబ్బారెడ్డికి అనుకూలంగా మారిపోతున్నారు. దీనిని ఎంత‌గా అరిక‌ట్టాల ‌న్నా.. సుధీర్‌రెడ్డికి సాధ్యం కావ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో ఆధిప‌త్య పోరు పెరిగిపోయి.. నువ్వా-నేనా.. అనే రేంజ్‌లో వివాదం న‌డుస్తోంద‌ని, దీంతో వైసీపీలో గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ర‌గ‌డ ముదురుతుందా?  లేక స‌మ‌సి పోతుందా? అనేది చూడాలి.
Tags:    

Similar News