`పద్మావతి`పై స్వామి షాకింగ్ కామెంట్స్‌!

Update: 2017-11-10 17:56 GMT
బీజేపీ సీనియ‌ర్ నేత‌ - రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి.....రాజ‌కీయాల‌పైనే కాకుండా సమ‌కాలీన అంశాల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిల‌వ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. శ‌శిక‌ళ కుటుంబీకుల‌పై  ఐటీ దాడుల నేప‌థ్యంలో ఆయ‌న సొంత‌పార్టీ బీజేపీపైనే విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించిన సంగ‌తి తెలిసిందే. తాను క‌రుణానిధి - క‌నిమొళిల ఆస్తుల పై కూడా నివేదిక ఇచ్చాన‌ని - వారి ఇళ్ల‌పై ఐటీ దాడులు ఎందుకు జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించి బీజేపీని ఇర‌కాటంలో ప‌డేశారు. తాజాగా, ఆయ‌న బాలీవుడ్ అప్ క‌మింగ్ మూవీ `పద్మావతి` పై త‌న‌దైన శైలిలో స్పందించారు. కొద్ది రోజుల నుంచి ఆ చిత్రం పై జ‌రుగుతున్న వివాదానికి స‌రికొత్త భాష్యం చెప్పారు.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆ చిత్రంలో ప‌ద్మావ‌తి క్యారెక్ట‌ర్ ను కించ‌ప‌రిచార‌ని - చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని బీజేపీ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌కు చూపించ‌కుండా ఆ సినిమాను విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని - ఒక‌వేళ విడుద‌లైన‌ సినిమా హాళ్ల‌ను త‌గుల‌బెడుతామ‌ని కొంద‌రు హెచ్చ‌రిక‌లు కూడా జారీచేశారు. అయితే, ఈ వివాదానికి స్వామి స‌రికొత్త రూపునిచ్చారు. ఈ సినిమా కు అస‌లు సిస‌లు నిర్మాత‌లు దుబాయ్ షేకులట‌. హిందూ మహిళల క్యారెక్టర్ ను దెబ్బ తీసేందుకు అరబ్బులు 'అంతర్జాతీయ కుట్ర` ప‌న్ని పద్మావతిని నిర్మించార‌ట‌. మొఘల్ చక్రవర్తులతో సాన్నిహిత్యం కోసం హిందూ ఆడవాళ్లు ప‌డిచ‌చ్చేవార‌న్ని 'వికృతమైన' భావాన్ని ఇటువంటి సినిమాల ద్వారా ప్ర‌చారం చేయ‌డ‌మే ఆ దుబాయ్ షేకుల ప్లాన్ అట‌. అందుకోస‌మే, చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి ఆ సినిమాలో పద్మిని క్యారెక్టర్ ని 'లోప్రొఫైల్'లో చూపించారని స్వామి ఆరోపిస్తున్నారు.

గతంలో వచ్చిన జోధా-అక్బర్ కూడా ఇటువంటి కుట్ర‌లో భాగ‌మేన‌ని, యూపీఏ హయాంలోనే ఈ ట్రెండ్ ఊపందుకుందని స్వామి సెల‌విచ్చారు. 'పద్మావతి` ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా భన్సాలీ ఆర్ధిక లావాదేవీలపై ఈడీతో దర్యాప్తు చేయిస్తే అసలు గుట్టు ర‌ట్ట‌వుతుంద‌ని చెప్పారు. దుబాయ్ కుట్ర బ‌య‌ట పెట్టేలా ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌ని కేంద్రానికి విన్న‌వించారు. మ‌రోవైపు -  పద్మావతి చిత్ర విడుదలను నిలిపివేయాలన్న పిటిషన్ ను దేశంలోనే అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించింది. సినిమాల విడుద‌ల విష‌యంలో సెన్సార్ బోర్డు స్వేచ్ఛను తాము హరించబోమని సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.
Tags:    

Similar News