రాహుల్ అడ్డంగా బుక్ అయ్యారా?

Update: 2016-03-15 04:52 GMT
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారా? ఆయనపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలు ఆసక్తికరంగా మారటమే కాదు.. రాహుల్ కు తలనొప్పులు తెచ్చి పెడతాయా? అన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపిస్తున్నారు. ఒక కంపెనీని స్టార్ట్ చేసిన రాహుల్.. ఆ కంపెనీకి ప్రతి ఏటా పన్నులు చెల్లించే క్రమంలో తనకు బ్రిటన్ పౌరసత్వం ఉందంటూ పేర్కొన్నారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని స్వామి ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ అంశంపై బీజేపీ ఎంపీ మహేశ్ గిరి స్పందించి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్వామి చేసిన ఆరోపణలపై తగిన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని జనవరి మొదటి వారంలో లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్.. నైతిక విలువల కమిటీకి పంపారు. లండన్ లో ఉన్నప్పుడు బ్రిటన్ పౌరసత్వాన్ని ఎలా చూపారో తెలపాల్సిందిగా షోకాజ్ నోటీసు ఇచ్చారు.

రాహుల్ బ్రిటన్ పౌరసత్వం వెనుక పెద్ద రహస్యం దాగి ఉందని బీజేపీ నేతలు పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదును తాను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ వెల్లడించారు. మరోవైపు.. తాజా పరిణామాల పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని తెర పైకితీసుకొచ్చినట్లుగా విమర్శించింది. ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడు విశ్వసనీయత ప్రదర్శించుకోవటానికి అద్భుతమైన అవకాశంగా భావించాలే కానీ.. అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేతలు అంతగా ఫీల్ కావాల్సిన అవసరం ఏముందన్నది ఒక ప్రశ్న. కొంపదీసి.. యువరాజుకు ద్వంద పౌరసత్వం ఉందా ఏంటి..?  

Tags:    

Similar News