మోడీ అచ్చేదిన్‌ పై స్వామి సంచ‌ల‌న కామెంట్లు

Update: 2016-07-01 07:40 GMT
నేనెవరినీ లెక్క చేయను అన్న ధోరణితో ముందుకు సాగే బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి ప్రధాని నరేంద్రమోడీపై గురిపెట్టాడు. మోడీ నిత్యం జ‌పించే ‘అచ్చే దిన్’పై సెటైర్లు గుప్పించారు. ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీ సుబ్రహ్మణ్యస్వామి వ్యవహారశైలిపై సున్నిత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయినా స్వామి త‌న ఆరోప‌ణ‌ల‌ను కొనసాగిస్తూ….ప్రధాని నరేంద్రమోడీ అచ్చే దిన్ ప్రచారంపై విమర్శిస్తూ వాస్తవ జీడీపి గణాంకాలను వెల్లడిస్తే పెద్ద వివాదం చెలరేగకమానదని పేర్కొన్నారు. ఈ రోజు ఆయన తన ట్విట్లర్లో వాస్తవ జీడీపీ గణాంకాలను తాను వెల్లడిస్తే అది కచ్చితంగా తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానంటూ విమర్శలు వెల్లువెత్తడం ఖాయమని పేర్కొన్నారు.

త‌న కామెంట్లు పార్టీకి ఇబ్బందిగా మారుతాయని తెలిసినా స్వామి ఈ విధంగా రెచ్చ‌గొట్ట‌డం ఇపుడు సంచ‌ల‌నంగా మారింది. స్వామి బెదిరింపుల‌పై స‌హ‌జంగానే కాంగ్రెస్ స్పందించింది. ఇన్నాళ్లు ఇత‌రుల‌పై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తే బీజేపీ నాయ‌కులు సంబ‌ర‌ప‌డ్డార‌ని ఇపుడు అది వారి నెత్తినే ప‌డింద‌ని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇదిలాఉండ‌గా అవినీతి ఆరోపణలతో మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి బలవంతంగా వైదొలగిన బీజేపీ సీనియర్ నేత ఏక్‌ నాథ్ ఖడ్సే సైతం ఇదే త‌ర‌హా వివాదానికి తెరలేపారు. తాను మాట్లాడటం ప్రారంభిస్తే దేశం మొత్తం వణుకుతుందని చెప్పారు. జల్గావ్‌ లోని తన నియోజకవర్గంలో మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, నాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసినప్పటికీ, నేను నోరు తెరిస్తే దేశం మొత్తం వణుకుతుంది అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి తానే కారణమని చెప్పుకొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేనతో తెగతెంపులు చేసుకోవాలని తానే సూచించానని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం శివసేనకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేవారని అన్నారు.
Tags:    

Similar News