ఆధార్ తో ఎంత డేంజ‌రో చెప్పిన స్వామి

Update: 2017-10-31 08:31 GMT
వివిధ సేవ‌ల‌కు ఆధార్ లింకేజ్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు సిమ్ కార్డు ఇవ్వ‌కున్నాఫ‌ర్లేదు కానీ తాను మాత్రం ఆధార్ లింకేజీ చేయ‌నంటే చేయ‌న‌ని తేల్చి చెబుతున్నారు. ఈ అంశంపై ఆమె సుప్రీంకోర్టు గ‌డ‌ప కూడా తొక్కారు. కాకుంటే.. ఆధార్ లింకేజ్ మీద వ్య‌క్తిగ‌త హోదాలో కాకుండా.. ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున పిటిష‌న్ వేసి ఎదురుదెబ్బ తిన్నారు. కావాలంటే ఆధార్ మీద వ్య‌క్తిగ‌త హోదాలో పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. ఆధార్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి. వివిధ సేవ‌ల‌కు.. సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఆధార్ అనుసంధానం చేయ‌టం ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేస్తున్న నేప‌థ్యంలో సుబ్ర‌మ‌ణ్య స్వామి తాజాగా మాట్లాడుతూ.. అలా చేయ‌టం జాతి భ‌ద్ర‌త‌కు వాటిల్లే ముప్పుగా వ్యాఖ్యానించారు.

ఆధార్ కార‌ణంగా జ‌రిగే న‌ష్టం మీద ప్ర‌ధాని మోడీకి లేఖ రాయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప‌లు సేవ‌లు పొంద‌టానికి ఆధార్ లింకేజ్ త‌ప్ప‌నిస‌రి చేయ‌టంపై సుప్రీంలో చ‌ర్చ జ‌రుగుతున్న అంశాన్ని ప్ర‌స్తావించిన స్వామి.. త‌ప్ప‌నిస‌రిగా సుప్రీం  నిలిపివేస్తుంద‌న్నారు. ఆధార్ కార‌ణంగా జాతికి ఎంత ముప్పు అన్న విష‌యాన్ని వివ‌రిస్తూ ప్ర‌ధాని మోడీకి తాను లేఖ రాయ‌నున్న‌ట్లుగా ట్విట్ట‌ర్లో ట్వీట్ చేశారు.

ఆధార్ లింకేజీ పై  బెంగాల్ సీఎం మ‌మ‌తా తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వేళ‌.. ఆమెకు తోడుగా బీజేపీ నేతే గ‌ళం విప్ప‌టం.. ప్ర‌ధానికి లేఖ రాస్తాన‌ని ట్వీట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. మోడీకి రాసిన లేఖ‌.. జాతి జ‌నుల‌కు కూడా విడుద‌ల చేస్తే.. ఎంత ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న విష‌యాన్ని అంద‌రూ తెలుసుకుంటారు క‌దా స్వామి..!
Tags:    

Similar News