టీటీడీపై సుప్రీంకు బీజేపీ.. బాబుకు షాక్

Update: 2018-06-04 06:03 GMT
ఏపీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆధిపత్యం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ చివరకు సీఎం చంద్రబాబు తిరుగుబాటుతో ఈ మధ్య కాస్తే వెనక్కి తగ్గింది. ఇలా అయితే లాభం లేదనుకొని ఈసారి చంద్రబాబుకు గట్టి షాకిచ్చేందుకు రెడీ అయ్యింది.. న్యాయపరంగా పోరాడి చంద్రబాబును ఇరుకున పెట్టాలని బీజేపీ పెద్ద స్కెచ్ వేసింది.

తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు బీజేపీ సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తన న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. తిరుమల ఆలయాన్ని ఏపీ గుప్పిట్లో నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని తాజాగా సుబ్రహ్మణ్య స్వామి విలేకరులతో ధ్రువీకరించారు. కోర్టులో దాఖలు నిమిత్తం వ్యాజ్యం తయారు చేస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి న్యాయవాద మిత్రులు మోహన్ దాస్ - టీఆర్ రమేష్ - ఆర్ రవిలతో సమావేశమైన ఫోటోను కూడా సుబ్రహ్మణ్య స్వామి విడుదల చేశారు.

* సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్లడానికి కారణం ఇదే

ఇటీవల టీటీడీ లోని కొందరు శ్రీవారి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే.. దీంతో ప్రభుత్వం ఆయనను ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా తప్పుపట్టారు. ఇందుకు నిరసనగానే టీటీడీ వ్యవహారాలను తేల్చేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. టీటీడీ నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణను కోరనున్నారు. 

*కోర్టులో ఏఏ అంశాలపై దాఖలు చేస్తారంటే..

రమణ దీక్షితులను టీటీడీ బోర్డు తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, బోర్డు నిర్ణయాన్ని కొట్టివేయాల్సిందిగా కోరుతూ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకు వెళతానని ప్రకటించారు. టీటీడీ ఆలయ నిధుల దుర్వినియోగంపై సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్టు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి టీటీడీని విముక్తి చేయాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ పరిణామాలు అధికార టీడీపీ, చంద్రబాబును షాక్ కు గురిచేస్తున్నాయి.

సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకు వెళితే టీటీడీ లో జరిగినవన్నీ బయటపడే అవకాశం ఉంది . పైగా కేంద్రం ఆధీనంలోని సీబీఐ విచారణ జరిపిస్తే ఇది అటుతిరిగి ఇటు తిరిగి చంద్రబాబు ప్రభుత్వానికే ఎసరు తెచ్చేలా ఉంది. మొత్తంగా చంద్రబాబు టార్గెట్ గా బీజేపీ చేస్తున్న టీటీడీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. బీజేపీతో వైరం పెట్టుకున్న బాబును ఇప్పుడు టీటీడీ బూచీ చూపి దెబ్బకొట్టేందుకు కమల దళం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ పరిణామాలు టీడీపీలో ఆందోళనకు కారణమవుతున్నాయి. 
Tags:    

Similar News