అదే సోను చేసిన తప్పా? అందుకే ఐటీ దాడులు తప్పలేదా?

Update: 2021-09-16 05:00 GMT
కష్టంలో ఉన్న వేళ సాయం అందించాల్సిన సర్కారు చేష్టలుడిగిపోయినట్లు చూస్తుండిపోయిన వేళ.. అపన్న హస్తాన్ని అందించి.. వారి కష్టాల్ని తీర్చే వ్యక్తిగా.. సినీ రంగంలో మొనగాళ్లు లాంటి రీల్ హీరోలు ఉన్న వేళలో.. రీల్ లైఫ్ లో విలనిజాన్ని పండించే సోనూసూద్ అందుకు భిన్నంగా సహాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. లాక్ డౌన్ తో మొదలైన ఆయన సేవా కార్యక్రమాలు.. అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. సాయం కోరినంతనే వారికి కావాల్సిన సాయాన్ని అందించేలా వ్యవహరించటంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ప్రభుత్వాల కంటే సత్వరంగా స్పందించే గుణం.. ఆయన్ను సామాన్యులకు దగ్గర చేసింది. కష్టం వచ్చినంతనే ఆయన పేరు గుర్తుకు వచ్చేలా మారింది.

అలాంటి సోనూసూద్ ఇల్లు.. ఆఫీసుల మీద ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకిలా? దానగుణంతో వ్యవహరించటమే సోనూసూద్ చేస్తున్న తప్పా? నిజంగానే.. ఆయన ఆదాయపన్నును ఎగ్గొట్టారనే అనుకుందాం. కానీ.. తన సేవా కార్యక్రమాలతో ప్రజలకు నేరుగా సాయం చేస్తున్నాడు కదా? అందుకోసం ప్రభుత్వం అతనికి ఎలాంటి ప్రత్యేక అధికారాలు.. వసతుల్ని అందించటం లేదు కదా?
అలా అని పన్ను ఎగవేతను మేం సమర్థించటం లేదు. కానీ.. దేశంలో పన్ను ఎగవేతకు పాల్పడే ఎందరితోనో పోల్చినప్పుడు సోనూసూద్ చాలా బెటర్ అని చెప్పాలి. ఒకవేళ.. పన్నుఎగవేత ఆరోపణలు నిజమైన పక్షంలో. ఎందుకంటే.. మిగిలిన వారిని వదిలేస్తే.. రాజకీయ నేతలు.. బడా పారిశ్రామికవేత్తలు ఎగ్గట్టే పన్ను ఆదాయం.. వారి వ్యాపారాల కోసం బ్యాంకుల వద్ద నుంచి తీసుకునే రుణాల్ని చెల్లించలేక చేతులు ఎత్తేయటం లాంటి వాటితో పోల్చినప్పుడు సోనూ లాంటి వ్యక్తి మీద ఐటీ అధికారులు దాడులు చేయటం సరైనదేనా? అన్నది ప్రశ్న.
సోనూసూద్ ఇంటి మీదా.. ఆఫీసు మీదా ఐటీ అధికారుల తనిఖీల వెనుక రాజకీయ కోణం ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. అలాంటిదేమీ లేదని చెబుతున్నా.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఇందులో అంతో ఇంతో నిజం ఉందన్న భావన కలగటం ఖాయం. ఢిల్లీ రాష్ట్ర సర్కారులోని ఆప్ ప్రభుత్వ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ సోనూసూద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా కలిశారు.

ఇలాంటి సందర్భంలోనే ఆప్ పార్టీలో సోనూసూద్ చేరుతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే.. అలాంటిదేమీ జరగలేదు. అయితే.. ఇక్కడో పాయింట్ ను ప్రస్తావించాలి. సోనూసూద్ పంజాబ్ లో జన్మించారు. ఈ ఏడాది చివర్లో పంజాబ్ తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్నకాంగ్రెస్ కు ధీటుగా ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్రంలో బలపడుతోంది. వ్యవసాయ చట్టం నేపథ్యంలో బీజేపీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో.. పోరు కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ మధ్యనే ఉంది. కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత పోరు.. ప్రభుత్వం మీద వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీ.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీనే మిగులుతుంది. అయితే.. రాష్ట్రంలో ఈ పార్టీకి జనాకర్షక నేత లేడన్న లోడు ఉంది. ఇలాంటివేళ.. సోనూసూద్ అయితే.. ఇట్టే ఇమిడిపోవటమే కాదు.. పంజాబీలు కోరుకున్న ప్రత్యామ్నాయాన్ని ఆమ్ ఆద్మీ ఇవ్వగలుగుతుంది.

ఒకవేళ.. ఆమ్ ఆద్మీ పార్టీలో సోనూసూద్ చేరినా.. లేదంటే.. ఆ పార్టీకి సూద్ నైతిక మద్దతు ఇస్తున్నా.. పంజాబ్ లో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఈ కారణంతోనే.. కేంద్రంలోని మోడీ సర్కార్ తన ‘పవర్’ను శాంపిల్ గా చూపించే క్రమంలోనే ఐటీ దాడులకు తెర తీసిందన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఈ ఊహాగానాల్ని బీజేపీ ఖండించింది. లాజికల్ గా చూసినప్పుడు.. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో ప్రజాకర్షక నేత ఉంటే.. ఆ రాష్ట్రంలో గెలుపు నల్లేరు మీద నడక కానుంది. ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండటానికి ఐటీ దాడుల్ని అస్త్రంగా వినియోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇల్లు.. ఆఫీసు మీద జరిగిన ఐటీ దాడులపై సోనూసూద్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.




Tags:    

Similar News