రెండేళ్ల‌లో దిమ్మ‌తిరిగిపోతుందంటున్న సుజ‌నా

Update: 2017-01-30 08:58 GMT
తెలుగుదేశం పార్టీ ఎంపీ - కేంద్ర శాస్త్ర - సాంకేతిక శాఖల సహాయ మంత్రి సుజనా చౌదరి మాట తీరును మెచ్చుకోవాల్సిందే. ప్ర‌త్యేక హోదా ఇప్పుడు ప్ర‌క‌టిస్తారు, అప్పుడు ప్ర‌క‌టిస్తారు అంటూ తేదీతో స‌హా చెప్పిన సుజానా...అన‌క కేంద్ర నో చెప్ప‌డంతో కొద్దికాలం మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ఏపీ అభివృద్ధి గురించి సుజ‌నా పెద్ద ఎత్తున జోస్యం చెప్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సుజనా చౌదరి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో సుజనా చౌదరి ప్రసంగిస్తూ నవ్యాంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలకు మించిన లబ్ధిని కేంద్రం ప్యాకేజీ ద్వారా అందిస్తుందని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ లభించనంత పెద్దమొత్తంలో నిధులు మంజూరు కానున్నాయని జోస్యం చెప్పారు.  మరో రెండేళ్లలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలే ప్రతిపక్షాల ఆరోపణలకు చెంపపెట్టు లాంటి సమాధానాలు చెబుతాయని, ఇప్పుడు విమ‌ర్శిస్తున్న వారి నోళ్లు మూత‌ప‌డ్తాయ‌ని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.

తమ మనుగడ కోసం, రాజకీయ గుర్తింపు కోసం ప్రత్యేక హోదా ఒక సంజీవని అని కొంద‌రు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని సుజ‌నా చౌద‌రి సూచించారు. రాష్ట్రానికి ఏం తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో అందరికంటే బాగా తెలిసిన నేత సీఎం చంద్రబాబు నాయుడని అన్నారు. ఆయన సమర్థతకు నిదర్శనంగా నేడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం ప్రతిక్షణం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని చూరగొన్నారు కనుకనే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కితాబిచ్చారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల సువిశాలమైన భూభాగాన్ని స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు చరిత్రలోనే లేవని, ఒక్క నవ్యాంధ్రలో చంద్రబాబు మాత్రమే సాధించిన అరుదైన ఘనత అని సుజ‌నా చౌద‌రి ప్ర‌శంసించారు. ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయనకు అన్నివిధాలా అండగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్తున్నాన‌ని ఆయ‌న వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News