సుజ‌నా మ‌ళ్లీ అదే మాట చెప్పేశారే

Update: 2017-01-28 06:01 GMT
కేంద్ర సహాయ మంత్రి - తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి త‌న మాట అంటే మాటేన‌ని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాకు - పారిశ్రామిక పన్ను రాయితీలకు ఎలాంటి సంబంధం లేదని గ‌తంలో చెప్పిన సుజ‌నా చౌద‌రి తాజాగా అదే మాట‌ను పున‌రుద్ఘాటించారు. ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు - సంస్థలు యువతను తప్పుదోవ పట్టిస్తూ ఆందోళనలకు పురికొల్పుతుండడం విచారకరమని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాకు - పారిశ్రామిక రాయితీలు - వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అంశాలకు ఎలాంటి సంబంధం లేనందునే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త కూడా అయిన అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో చేసిన ప్రకటనలో వీటిపై విడివిడిగా హామీలిచ్చారని సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అత్యంత అశాస్త్రీయంగా - అసమాన ప్రాతిపదిగా విభజించిందని దుయ్యబట్టిన ఆయన కేంద్రంలో భాగస్వామిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని తిరిగి ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ది చెందేలా అహర్నిశలు కృషి చేస్తోందని, ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొంటున్నదని ఆయ‌న‌ వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదా హామీతో సహా విభజన హామీలన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసి తీరాల్సిందేనని అయితే, పధ్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులు - రాష్ట్రాలకు కేంద్ర సహాయం పంపిణీ విధానంలో వచ్చిన మార్పుల నేపధ్యంలో ఏ రాష్ట్రానికీ ఎలాంటి ప్రత్యేక హోదాను మంజూరు చేయడం సాధ్యం కాదని సుజ‌నా చౌద‌రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హోదాతో సరిసమానంగా విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టుల రూపంలో నిధులు సమకూర్చేందుకు అంగీకరించడంతో సంతృప్తి చెందామని సుజనా చౌదరి వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన వెలువడేంత వరకూ పార్లమెంట్‌ లో టీడీపీ పార్లమెంట్‌ సభ్యులు తమకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని విభజన హామీల అమలు కోసం పట్టుబట్టార‌ని వివ‌రించారు.

రిపబ్లిక్‌ దినోత్సవం నాడు ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రంలో అలజడిని సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదని సుజ‌న అన్నారు. రాజకీయాలను - అభివృద్ధిని ఒకదానితో మరోదానిని ముడిపెట్టి రాష్ట్ర భవిష్యత్తును పాడుచేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చేపట్టడం అనవసరమ‌ని  బ‌దులుగా కోళ్ల పందాలు - పందుల పోటీలు పెట్టుకోండి అనే చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదం కావడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా సంప్రదాయక క్రీడలకు అనుమతి కోసం అందరూ కలిసి పోరాడవచ్చుననే తప్ప ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారిని, యువతను కించపరిచే ఉద్దేశం తనకేమాత్రం లేదని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, ఎవరైనా తన వ్యాఖ్యలను అపార్థం చేసుకొంటే వాటిని ఉపసంహరించుకొనేందుకు అభ్యంతరం లేదంటూ సుజ‌నా చౌద‌రి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి సమకూరి ఉండే నిధులను ప్రత్యేక ప్యాకేజీ రూపంలో కేంద్రం పూర్తిగా సమ కూరుస్తున్న నేపధ్యంలో ఎలాంటి ఐక్య ఉద్యమాలు, ఆందోళనలు అవసరం లేదన్నదే తన నిశ్చితాభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. హోదా పేరుతో విద్యార్థులు - యువతీ యువకులను రెచ్చగొట్టి వీధుల్లోకి రప్పించడం వారి భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి మేలు చేకూర్చదంటూ ఇలాంటి విధానాలను వారు పున:పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తాను బ్యాంకులకు అప్పులు ఎగవేశానని - తన వ్యాపారాలపై విచారణ జరగాలని డిమాండ్‌ చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శలకు కూడా సుజనా చౌదరి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆర్థిక నేరాలు వేరు - ఆర్థిక ఇబ్బందులు వేరన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. తానింతవరకూ ఎవరికీ ఒక్క పైసా ఎగ్గొట్టలేదని, ఎవరికీ అన్యాయం చేయలేదని, తనపై ఎలాంటి దర్యాప్తు - విచారణలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. స్వతహాగా వ్యాపారవేత్తనైన తాను ఎన్నో కంపెనీలు స్థాపించి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నానని ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News