అయ్యో.. ఆ సిక్సుల వీరుడు.. ప్రమోషన్ నుంచి డిమోషన్ కు..

Update: 2020-10-09 01:30 GMT
సునీల్ నరైన్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక ఆటగాడు. అతడి ప్రతిభ పట్ల జట్టు యాజమాన్యానికి అపారమైన నమ్మకం ఉంది. అందుకే చాలా ఏళ్ళ నుంచి అదే జట్టు తరపున ఆడుతున్నాడు. గతంలో కేకేఆర్ కు ఎన్నో విజయాలు అందించిన అతడు ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన నరైన కేవలం 44 పరుగులు మాత్రమే సాధించాడు. అత్యధిక స్కోర్ 17 మాత్రమే. ప్రతి మ్యాచ్ లో అతడు బాల్స్ వృథా చేస్తున్నాడని అభిమానులు మండిపడుతున్నారు. బౌలింగ్ లోనూ అతడు మునుపటిలా ప్రభావం చూపడం లేదని విమర్శిస్తున్నారు.

2017 సీజన్లో కోల్ కతా ఓపెనర్ క్రిస్ లిన్ గాయపడటంతో జట్టుకు మంచి ఓపెనర్ అవసరం అయ్యాడు. స్పిన్నర్ గా రాణిస్తున్న నరైన్ ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ లో కూడా దూకుడు చూపుతుండడంతో అతడిని ఓపెనర్ గా బరిలోకి దింపాలని కలిస్, సైమన్, బాలాజీలతో కూడిన కోచ్ ల బృందం నిర్ణయించగా కెప్టెన్ గంభీర్ కూడా మద్దతు తెలిపాడు. అనుకున్నట్టుగానే ఓపెనర్ గా బరిలోకి దింపగా కెప్టెన్, కోచ్ ల నమ్మకాన్ని నిలబెడుతూ అతడు అద్భుతంగా విజయవంతం అయ్యాడు. ఆట మొదలైనప్పటి నుంచి అతడు ఎడా పెడా సిక్సులు , ఫోర్లు బాదేవాడు. దీంతో అతడికి జట్టులో విధ్వంస కారుడిగా పేరు వచ్చింది.

కెప్టెన్ గంభీర్ అతడికి మంచి అవకాశాలు ఇచ్చాడు. అయితే ఈ సీజన్లో నరైన్ ఒక్క మ్యాచ్ లోనూ బ్యాట్ కు పని చెప్పలేదు. పైగా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి వ్యక్తిగత ఫాంతో పాటు జట్టు వరుస ఓటములతో విమర్శలు మొదలయ్యాయి. ఆఖర్లో బ్యాటింగ్ కు వస్తున్న రాహుల్ త్రిపాఠి , మోర్గాన్ ఆదరగొడుతుండడంతో ఫాంలో లేని నరైన్ ను ముందు ఎందుకు పంపుతున్నారంటూ.. కోల్ కతా ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

దీంతో నరైన్ ను బుధవారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో వెనక పంపి త్రిపాఠిని ఓపెనర్ గా పంపారు. అతడు అవకాశం సద్వినియోగం చేసుకుని 81 పరుగులు సాధించడంతో ఇక నరైన్ కు దెబ్బ పడ్డట్లేనని అంటున్నారు. అతడు బౌలింగ్ లోనూ అంతగా రాణించడం లేదు. ఇప్పటివరకూ ఈ సీజన్లో కేవలం మూడు వికెట్స్ మాత్రమే తీశాడు. నరైన్ ఇలాగే ఆడితే జట్టులో చోటు కుడా కష్టమేనని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.


Tags:    

Similar News