సున్నానికి ఏపీలోనూ ప్రాతినిధ్యం కావాలంట

Update: 2015-07-07 05:33 GMT
ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆసక్తికర ప్రకటన చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఏపీకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ మండలాలు ఉన్న ఏపీ అసెంబ్లీలోనూ తనకు ప్రాతినిధ్యం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరుతున్నారు.

హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసిన సున్నం రాజయ్య.. ఆయన పార్టీ ప్రతినిధులు.. ఈ చిత్రమైన వాదనను వినిపించారు. పోలవరంముంపు మండలాల కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్ని రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కలిపివేయటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ కూడా విడుదలైంది. మొన్నటివరకూ ఖమ్మం పరిధిలోని ఈ ఏడు మండలాలు ఇప్పుఉ.. ఉభయ గోదావరి జిల్లాల్లో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారు లేరని.. అందుకే వారున్న ఏపీ అసెంబ్లీలోనూ తనకు ప్రాతినిధ్యం వహించేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్థిస్తున్నారు.

ఏడు మండలాల్ని ఏపీలో కలిపినా వారి ఓట్లు తెలంగాణలోనే ఉన్నాయని.. ఇటీవల జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు కీలకంగా మారిన నేపథ్యంలో తనకు ఏపీ అసెంబ్లీలో కూర్చునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విభజన ఒకసారి పూర్తి అయ్యాక.. ఏ ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిపోతారు. అంతేకానీ.. ఒక వ్యక్తి కోసం.. మొత్తం వ్యవస్థలోని నిబంధనల్ని మార్చమనటం కాస్త చిత్రమే.

గతంలో ఏపీలోఉన్న ఓటుహక్కు ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఓటుహక్కు పొందిన తర్వాత కూడా.. వేరే రాష్ట్రం కాబట్టి.. అక్కడ తనకు ఆస్తులు ఉన్నాయని చెప్పి.. తన ఓటు హక్కును ఆ రాష్ట్రంలో కూడా కొనసాగించండని కోరితే ఎలా ఉంటుందో.. సున్నం రాజయ్య ప్రతిపాదన కూడా అలానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంపు మండలాల్ని ఏయే నియోజకవర్గాల కింద చేర్చారు.. సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే వారి ఇబ్బందుల్ని పరిష్కరిస్తారు. దానికి సున్నం రాజయ్యకు ప్రత్యేక అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు.

Tags:    

Similar News