జాతీయ భాష‌గా సంస్కృతం.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!

Update: 2022-09-02 11:30 GMT
జాతీయ భాషగా సంస్కృతాన్ని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిల్ ను విచారించిన ధ‌ర్మాస‌నం దాన్ని తోసిపుచ్చింది. ఇప్ప‌టికే దేశంలో హిందీ జాతీయ భాష‌గా ఉంద‌ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అలాగే వివిధ భాష‌ల‌ను జాతీయ భాష‌లుగా ప్ర‌క‌టించాల‌నే డిమాండ్లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొంది.

జాతీయ భాష‌గా ఒక భాష‌ను ప్ర‌క‌టించే అంశం కోర్టు ప‌రిధిలోనిది కాద‌ని.. అది పార్ల‌మెంటు ప‌రిధిలోని అంశ‌మ‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం తెలిపింది. ఈ మేర‌కు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఒక భాష‌ను జాతీయ భాష‌గా ప్ర‌క‌టించ‌డానికి రాజ్యాంగం, విధానపరమైన మార్పులు అవసరమని తేల్చిచెప్పింది. ఇందులో సుప్రీంకోర్టు ఏమీ చేయలేదని వెల్ల‌డించింది.

కాగా మ‌న‌దేశంలో ప్రస్తుతం జాతీయ భాషగా హిందీ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మిగతా భాషల్ని కూడా జాతీయ భాషలుగా ప్రకటించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. త‌మిళం, క‌న్న‌డం, త‌దిత‌ర భాష‌ల్ని జాతీయ భాష‌లుగా ప్ర‌క‌టించాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, పార్టీలు కోరుతున్నాయి. ఇదే క్రమంలో దేవ భాష‌గా పేరున్న సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే దేవ భాష అయిన సంస్కృతాన్ని జాతీయ భాష‌గా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అయితే దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం... ప్రచారం కోసం ఇలాంటి వ్యాజ్యాలను దాఖ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించింది. ఇలా ప్ర‌చారం కోసం దాఖ‌ల‌య్యే  పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ ఆ పిటిష‌న్‌ను తోసిపుచ్చింది.

ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం పిటిష‌న‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. జాతీయ భాష‌గా సంస్కృతాన్ని ప్ర‌క‌టించాల‌ని కోరుతూ మీరు సంస్కృతంలో మీ ప్రార్థనను రూపొందించారని కోర్టు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

మీ ప్రచారం కోసం మేం ఎందుకు నోటీసు జారీ చేయాల‌ని పిటిషనర్ ను ప్రశ్నించింది. దీనిపై చర్చించడానికి సరైన వేదిక పార్లమెంటు మాత్రమేనని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. సంస్కృతాన్ని జాతీయ భాష‌గా ప్ర‌క‌టించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఆ పిటిష‌న్‌ను కొట్టేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News